తెలంగాణలో పులులు 20

27 Jan, 2018 02:53 IST|Sakshi

ఆదిలాబాద్‌లో 6, అమ్రాబాద్‌లో 14 పైగా...

కాలి అడుగులు, విసర్జితాల ఆధారంగా ప్రాథమిక అంచనా

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణలో పెద్దపులులు 20కిపైగానే ఉన్నాయి. ఇం దులో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో ఆరు, అమ్రాబాద్‌ అడవుల్లో 14 వరకు ఉన్నట్లు భావిస్తున్నారు.  లభించిన పులి అడుగులను బట్టి ఈ సంఖ్య కొంత ఎక్కువగానే ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 2014లో జరిగిన వన్యప్రాణుల గణనతో పోలిస్తే పులుల సంఖ్యలో పెద్దగా తేడా లేకపోయినా ఇతర రాష్ట్రాల్లోని అడవులకు రాకపోకలు పెరిగినట్లు తేలింది. 

ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే వన్యప్రాణుల గణన ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా మొదలైంది. ఇందు లో భాగంగా 22 నుంచి 24 వరకు మాంసాహార, 27 నుంచి 29 వరకు శాఖాహార జంతువుల గణన జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,000కుపైగా ఉన్న ఫారెస్ట్‌ బీట్లలో అటవీ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు గణనలో పాల్గొంటు న్నారు.  సేకరించిన అడుగుల ఆధారంగా ఆదిలాబాద్, అమ్రాబాద్‌ (నల్లమల) అడవుల్లో 20కి పైగానే పులులున్నట్లు  అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

విసర్జితాలు, పగ్‌మార్క్స్‌ ఆధారంగా...
వన్యప్రాణుల గణనలో పులుల విసర్జితాలు, కాలి అడుగుల గుర్తులను సేకరించారు. వైల్డ్‌ లైఫ్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పులుల జాడలకు సంబంధించి, ఆన్‌లైన్‌లో ఫారాలను భర్తీ చేసి పంపు తారు. వాటికి పులి పగ్‌మార్క్స్‌ ఫొటోలను, విసర్జితాల ఫొటోలను జత చేస్తారు. విసర్జితాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించనున్నారు. సీసీఎంబీ నివేదికలో పులి విసర్జితాలా లేదా అనేది తేలనుంది.

ఈ ప్రక్రియ తరువాత రెండో దశలో వైల్డ్‌లైఫ్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా అడవుల్లో కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ఫొటోలను తీయనున్నారు. పులులు సంచరిస్తున్నట్లు తేలితే ఆయా ప్రాంతాల్లో వాటికి నీరు, ఆహారం కల్పించే ఏర్పాట్లు చేస్తారు. పులల గణనలో భాగంగా అటవీ అధికారులు అడవుల్లో తిరుగుతుండగా ఈనెల 23న కాగజ్‌నగర్‌ ప్రాం తంలో బస్సు ప్రయాణికులకు పులి రోడ్డు దాటుతూ కనిపించింది. పెంచికల్‌పేట ప్రాంతంలోని అడవుల్లో  పులి రోడ్డు దాటుతూ కనిపించిందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు