అలా.. అడవిలో పులి

4 Feb, 2020 07:50 IST|Sakshi
కోటపల్లి:  అటవీప్రాంతంలో  నీటిని తాగుతున్న పులి 

సాక్షి, తాంసి/కోటపలి్ల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. ప్రశాంతంగా ఉన్న పల్లె వాసులు పులి సంచరిస్తుందన్న సమాచారంతో భయాందోళనలకు లోనవుతున్నారు. భీంపూర్‌ మండలంలోని ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాలతో పాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కూడా పులి కదలికలు మొదలయ్యాయి. పులి సంచరిస్తుందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలని, రాత్రిళ్లు పొలాల వద్ద నిద్రించొద్దని సూచిస్తున్నారు. పశువులను ఎవరూ కూడా పొలాల వద్ద ఉంచకూడదంటున్నారు. వేటగాళ్ల నుంచి పులిని కాపాడేందుకు అటవీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని గాబరా పడుతున్నారు. ఇటీవల నాగంపేట అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడిన వేటగాన్ని అటవీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం పులి సంచారానికి ఎంత భద్రత ఉందో తెలియజేస్తోంది. 

భీంపూర్‌ మండలంలో..
భీంపూర్‌ మండలంలోని ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి శుక్రవారం పశువులపై దాడి చేసి హతమార్చింది. తాంసి(కె), ఇందూర్‌పల్లి గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో అధికారులు పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఆదిలాబాద్‌ డివిజన్‌ అటవీ శాఖ అధికారి అప్పయ్య అటవీ సిబ్బందితో కలిసి తాంసి(కె) గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంతో పాటు, పెన్‌గంగ పరివాహక ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ఆదిలాబాద్‌ డివిజన్‌ అటవీశాఖ అధికారి అప్పయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం భీంపూర్‌ మండలంలోని తాంసి(కె), ఇందూర్‌పల్లి వద్ద పులి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో కదలికలు కనిపించాయని తెలిపారు. పక్కన ఉన్న మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి పులులు వలస వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్‌ ఆఫీసర్‌ గులాబ్, బీట్‌ ఆఫీసర్‌ కేశవ్, ఎనిమల్‌ ట్రా కర్స్‌ సోనేరావు, అనిల్, శంకర్‌ తదితరులు ఉన్నారు.

తాంసి(కె) వద్ద పులిసంచారం కదలికల కోసం సీసీ కెమెరాలు  ఏర్పాటు చేస్తున్న అటవీశాఖ సిబ్బంది

కోటపల్లి మండలంలో..
గతేడాది డిసెంబర్‌లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి చంపిన పులి మళ్లీ చాలా రోజుల తర్వాత కోటపల్లి మండలంలో సోమవారం ఉదయం సమయంలో రోడ్డు దాటినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చెన్నూర్‌ నుంచి కోటపలి్లకి అటోలో వస్తున్న ఉపాధ్యాయులకు పులి రోడ్డు దాటుతూ కంటపడటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి కళ్ల ముందే రోడ్డు దాటి వెళ్లడంతో ఉపాధ్యాయులకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించగా పులి రోడ్డు దాటిన ప్రదేశాన్ని అటవీ అధికారులు సందర్శించారు. కాగా కోటపల్లి అడవిలో సంచరిస్తూ ఉపాధ్యాయుల కంట పడిన పులి కే4 గా భావిస్తున్నారు. కోటపల్లి, చెన్నూర్‌ బీట్‌ పరిధిలోని సంకారం అటవీప్రాంతంలో పాటి మడుగు సమీపంలో పులి లేగదూడపై దాడి చేయడంతో బాధితుడు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. కోటపల్లి, చెన్నూర్‌ ఫారెస్టు డివిజన్‌ పరిధిలో ఏ1, సీ1 పులులు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. కేవలం కే4 మాత్రమే సీసీ కెమెరాల కంట పడుతోంది. కానీ మిగతా పులులు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించడం లేదని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమచారం.

ప్రజలకు భద్రతగా  బేస్‌ క్యాంపు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు
భీంపూర్‌ మండలంలో ఇప్పటికే ఇందూర్‌పల్లి, తాంసి(కె) గ్రామాల వద్ద పులి సంచారం ఉందని ఖరారు కావడంతో పాటు ఆనవాళ్లు కనిపించడంతో మండలంలోని ప్రజలకు భద్రతగా, పులి సంరక్షణ కొరకు అటవీశాఖ అధికారులతో బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. తాంసి(కె), అర్లి(టి) గ్రామాల వద్ద ఆదివారం నుంచి అటవీశాఖ అధికారులు బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. అటవీశాఖ అధికారులు పులి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ద్వారా గమనిస్తూ పులి కదలికలను పరిశీలిస్తున్నారు.

తాంసి: పెన్‌గంగాలో నీటి వద్ద అడుగులు పరిశీలిస్తున్న అటవీ అధికారులు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా