‘చలో అసెంబ్లీ’ కట్టడికి భారీ భద్రత 

27 Oct, 2017 01:11 IST|Sakshi

అసెంబ్లీకి 3 కి.మీ. పరిధిలో 144 సెక్షన్‌ అమలు

 మొత్తం 3 వేల మంది సిబ్బంది మోహరింపు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. రైతు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం భారీ స్థాయిలో అసెంబ్లీ ముట్టడి చేపడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘చలో అసెంబ్లీ’ని నియంత్రించేందుకు పోలీసుశాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీకి మూడు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమల్లోకి తెస్తూ నగర పోలీసు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం నలగురికి మించి ప్రజలు ఒకేచోట గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేదం.

అయితే వేలాది మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు, మూడంచెల బందోబస్తు వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల నుంచి అసెంబ్లీ వైపునకు వచ్చే దారుల్లో ఆందోళనకారులను అరెస్ట్‌ చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించారు. బస్సులు, ఆటోల్లో అప్పటికప్పుడు అసెంబ్లీ ఎదుట దిగి ముట్టడికి యత్నించే వారిని నియంత్రించేందుకు అసెంబ్లీ దారిలో 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సచివాలయం, రవీంద్ర భారతి, నాంపల్లి రైల్వేస్టేషన్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్‌ తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కిలోమీటర్‌ దూరంలో ఒక దశ బందోబస్తు ఏర్పాటు చేయగా, గన్‌పార్క్, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం, రవీంద్ర భారతి వద్ద రెండో దశ బందోబస్తు, అసెంబ్లీ వద్ద మూడో దశ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3 వేల పోలీసులను బందోబస్తు కోసం మోహరించారు. 

జిల్లాల్లో ముందస్తు అరెస్టులు
కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని హెడ్‌క్వార్టర్లు, అర్బన్‌ ప్రాంతాల్లో కార్యకర్తలు, ఆందోళనకారులను పోలీసు యంత్రాగం ముందుగానే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో బడా నేతలను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ యూత్, ఎన్‌ఎస్‌యూఐ నేతలను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు