సర్కారీ జాగా... అక్రమార్కుల పాగా!

16 May, 2015 02:22 IST|Sakshi

- టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ
- జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన
- ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ
- శిఖం భూములపై ఆచితూచి అడుగు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణదారులంతా జీవో 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణ ఉదారంగా వ్యవహ రించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో.. చెరువులు, స్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలపై కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే  అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులను పరిశీలించనున్నారు.

శిఖం స్థలాలకు వెనుకడుగు!
ఇదిలా ఉండగా శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాటి జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. గతంలో చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. శిఖం/ఎఫ్‌టీఎల్‌లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. అయితే శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, న్యాయస్థానాలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి  వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు