నేడు టింబర్‌ డిపోల బంద్‌ 

11 Feb, 2019 02:33 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌: తెలంగాణ అటవీ శాఖ విధించిన నూతన ఆంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సామిల్స్, టింబర్‌ డిపోలను ఈ నెల 11, 12, 13 తేదీల్లో సామూహికంగా బంద్‌ చేస్తున్నట్లు ది తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ టింబర్‌ మర్చంట్స్, సామిల్లర్స్, అలైడ్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఆదివారం సికింద్రాబాద్‌ బోయిగూడలో జరిగిన టింబర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ టింబర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.గోపీకృష్ణ మాట్లాడుతూ.. జీవో 55ను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 తమకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించిందని అన్నారు. వాల్టాపై ఆన్‌లైన్‌ అనుమతిని ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లుగా వేప, తుమ్మ, మామిడి చెట్లకు రూ. 450కి బదులుగా రూ. 50 చొప్పున అమలు చేయాలని కోరారు. రైతు పట్టా భూమిలో టేకుచెట్ల కొనుగోలుకు రవాణా అనుమతిని వారం రోజుల్లో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు వాసుదేవరావు, విజయ్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు