సమయం ఒక్కరోజు మాత్రమే...

23 Jun, 2018 13:05 IST|Sakshi

వీఆర్‌ఎ పదోన్నతుల ప్రక్రియలో మరో కోణం

తాజాగా 436 మందితో తాత్కాలిక జాబితా

పరిశీలనకు మండలాలకు పంపించిన అధికారులు 

ఒక్కరోజు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశం

సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీఆర్‌ఏల పదోన్నతుల ప్రక్రియపై కస రత్తు ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం పదో న్నతులు ఇచ్చినా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా మరో కొత్త కోణానికి తెరతీశారు. వీఆర్‌ఏల తాత్కాలిక జాబితాను రూపొందించి ఒక్కరోజు సమయమిస్తూ పరిశీలన కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పంపారు. తాజాగా 436 మందితో మెరిట్‌ ప్రకారం ఫైనల్‌ సీనియారిటీ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసిన అధికారులు తహసీల్దార్ల నుండి నివేదిక కోరారు. ఈనెల 21న అంటే గురువారం జాబితాను తహసీల్దార్లకు పంపి శుక్రవారమే నివేదిక పంపించాలని సూచించారు.

ఒక్కరోజే సమయం ఇవ్వడంతో ఒకరు, ఇద్దరు తప్ప మిగతా వారెవరూ నివేదికను కలెక్టర్‌కు పంపించలేదు. భూప్రక్షాళన కార్యక్రమంలో బిజీగా ఉన్న తహసీల్దార్లు పరిశీలన నివేదికను ఒక్కరోజులో కావాలని ఆదేశించడంపై పెదవి విరుస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఢిల్లీ నుండి రాకముందే ఈ ప్రక్రియను ముగించాలన్న ఉద్దేశంతో ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 13న ఉమ్మడి జిల్లాలో 80 మంది వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన కలెక్టర్‌ జాబితా పునఃపరిశీలనకు ఆదేశించా రు. జాబితాను మూడు రోజులు పరిశీలించగా అక్రమాలు వాస్తవమని తేలడంతో తాజాగా మరోసారి తాత్కాలిక జాబితా రూపొందించారు. 


ఆయన అనుకున్నదే చేస్తారా..
కలెక్టరేట్‌లో తనదైన ముద్ర వేసుకున్న కీలక అధి కారి తాను చెప్పిందే వేదంగా ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలు బయటపడడంతో తన చేతికి మట్టి అంటకుండా కింది స్థాయి సిబ్బందిపై నెడుతున్నట్లు సమాచారం. తప్పుడు వివరాలు పొందుపరిచి ఏకంగా జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించారంటే ఆయన పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో కలెక్టర్‌ లేని సమయంలో పరిశీలన నివేదికల కోసం ఆదేశించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాను అనుకున్నదే చేసి తీరాలని, తనను వ్య తిరేకిస్తున్న వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.  


15రోజుల సమయం ఇవ్వాలి 
వీఆర్‌ఏల పదోన్నతుల్లో మరోసారి తప్పిదాలు చేస్తే ఆందోళనలు తప్పవని డైరెక్ట్‌ రిక్రూట్‌ వీఆర్‌ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుగౌడ్‌ తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాత్కాలిక జాబితాను రూపొందించిన కలెక్టరేట్‌ అధికారులు పరిశీలన నివేదిక కోసం తహసీల్దార్‌ కార్యాలయ అధికారులకు ఒక్క రోజు సమయమివ్వడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ చొరవతో పదోన్నతుల జాబితాపై పునపరిశీలన జరిగిందని, అక్రమాలు జరిగాయని స్ఫష్టం కావడంతో మరోసారి తాత్కాలిక జాబితాను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు పరిశీలనకు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈ నెల 21 నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల సీనియారిటీ, ఇంటర్‌ అర్హత కలిగిన వీఆర్‌ఏలందరినీ తాత్కాలిక జాబితాలో చేర్చాలని, ఆ జాబితాను నోటీసు బోర్డుపై పబ్లిష్‌ చేయాలని, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు