ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ

15 Nov, 2018 18:08 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి

బోధన్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డి

సాక్షి,బోధన్‌(నిజామాబాద్‌): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ బోధన్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల చొప్పన పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం మండలంలోని రాజీవ్‌నగర్‌ తాండ, బెల్లాల్, ఊట్‌పల్లి, అమ్దాపూర్‌ గ్రామాల్లో సుదర్శన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలమైందని, స్వార్థ ప్రయోజనాల కోసం మిషన్‌ భగీరథ వంటి పథకాలను చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని, అప్పటివకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మండలాధ్యక్షుడు నాగేశ్వర్‌రావ్, నేతలు నరేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఖలీల్, శంకర్, సురేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు