నీటి లభ్యత లేనందునే.. 

5 Sep, 2018 02:14 IST|Sakshi

తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు డిజైన్‌ మార్పుపై ప్రభుత్వం స్పష్టీకరణ

 ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ అధ్యక్షతన గోదావరి నీటి వినియోగంపై రౌండ్‌టేబుల్‌

 కాళేశ్వరం ఓ బ్లండర్‌: రఘు, టీ–జేఏసీ చైర్మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా నిర్మించతలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనందునే దాన్ని రీ డిజైనింగ్‌ చేసి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిం దని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం సూచనల మేరకే మేడిగడ్డకు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టామని పేర్కొంది. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో గోదావరి నదీ జలాల వినియోగంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ సెక్రటరీ రామేశ్వర్‌ రావు, రిటైర్డ్‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సత్తిరెడ్డి, సానా మారుతి, నీటి పారుదల సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, నరసింహారావు, శాఖ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, తెలంగాణ ఇంజనీర్ల ఫోరం నేత దొంతు లక్ష్మీనారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కె.రఘు, గుజ్జా భిక్షం తదితరులు హాజరయ్యారు.  

మార్పు మంచికే... 
మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునేలా చేసిన మార్పులు రాష్ట్ర బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినవే అని ప్రభుత్వ తరఫు ఇంజనీర్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘తమ్మిడివద్ద 273 టీఎంసీ లభ్యత ఉందని ప్రభుత్వం మొదటగా డీపీఆర్‌ సమర్పిస్తే, కేంద్ర జల సంఘం దాన్ని పరిశీలించి 165 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపింది. ఇందులోనూ ఎగువ రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కలసి ఉన్నాయని చెప్పింది. 75శాతం డిపెండబిలిటీ లెక్కన ఇక్కడ వినియోగించుకునే నీళ్లు కేవలం 80 టీఎంసీలకు మించదు. ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీరివ్వలేం. అందుకే నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. మేడిగడ్డ వద్ద 284 టీఎంసీ లభ్యత ఉందని, కేంద్ర జల సంఘమే చెప్పింది’అని పేర్కొ న్నారు.  కేంద్రం సూచనల మేరకే రిజర్వాయర్ల కెపాసిటీని 147 టీఎంసీలు పెంచామన్నారు. శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే మాట్లాడుతూ.. కాళేశ్వరంపై జేఏసీ రఘు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.  కేంద్ర జల సంఘం అనుమతులనే తప్పుపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు.  

అది వండర్‌ కాదు.. బ్లండర్‌.. 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తప్పుడు పునాదులపై నిర్మిస్తున్నారని కె.రఘు విమర్శించారు. ప్రాణహితలో లభ్యతగా ఉన్న 213 టీఎంసీ, మిడ్‌ గోదావరిలోని 185 టీఎంసీ, మానేరులో 17 టీఎంసీ కలిపి మొత్తం 415 టీఎంసీల లభ్యత మేడిగడ్డ వద్ద ఉందని డీపీఆర్‌లో పేర్కొనడం తప్పన్నారు. ప్రాణహిత, మిడ్‌ గోదా వరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకోవడం భారీ తప్పిదమ న్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరేనని, ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్‌ వద్దనే ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమేనన్నారు. అన్ని విషయాలని కేంద్ర జల సంఘానికి ఆపాదించి ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి ఎత్తిపోతల చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. 

మరిన్ని వార్తలు