సమైక్యాంధ్రలోనే మొదలు

14 Oct, 2019 04:34 IST|Sakshi

ఆర్టీసీ విలీన ప్రక్రియపై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

హన్మకొండ: ‘సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే ఆర్టీసీ విభజన ప్రక్రియ మొదలైంది. జీఓలు జారీ చేసే సమయానికి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచింది’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. హన్మకొండలో ఆర్టీసీ జేఏసీ వరంగల్‌ రీజియన్‌ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ నాటి ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలైందని, ఆ సమయంలో అప్పటి ఉద్యమ నేత గా ఉన్న కేసీఆర్‌తో పాటు నేతలంతా చెప్పినట్లుగానే స్వరాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారన్నారు. ఈ డిమాండ్‌ కొత్తగా వచ్చిందేమి కాదన్నారు. ఎట్లాగూ ఓట్లు వేసి గెలిపించారు.. ఇక తాను చెప్పినట్లే వినాలన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్ర సంపదంతా తనకు, మెగా కృష్ణారెడ్డికి అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తూ తన సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత టి.వెంకట్రాములు, సీపీఎం నేత జి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు