సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!

16 Jun, 2019 02:01 IST|Sakshi
శనివారం విలేకరులతో మాట్లాడుతున్న రవీందర్‌రెడ్డి. చిత్రంలో మమత తదితరులు

ఈ విధానంతో ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు

మీడియా సమావేశంలో టీఎన్జీవోస్‌ నేతలు రవీందర్‌రెడ్డి, మమత 

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి నష్టమేతప్ప లాభం లేదని పేర్కొంది. పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పెన్షన్‌ ఇవ్వాలని కోరింది. శనివారం ఇక్కడ నాంపల్లిలోని టీఎన్జీవోస్‌ భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ భేటీ జరిగింది. సమావేశంలో 18 అంశాల పై తీర్మానాలు చేశారు. తీర్మానాల ప్రతిని ప్రభుత్వానికి సమర్పించి వీటిని మంజూరు చేయించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ కె.రవీందర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ వి.మమత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఐఆర్, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. ఏపీలో పని చేస్తున్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని, ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
 
బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణ చేపట్టాలి 
బడిబాట కార్యక్రమం తర్వాతే పాఠశాలల హేతుబ ద్ధీకరణను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలనలో భాగంగా చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు సహకరిస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని, వెల్‌నెస్‌ సెంటర్లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. 010 పద్దు కింద గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ కమిటీ, వర్సిటీలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి జూన్, జూలైల్లో సాధారణ బదిలీ లకు అనుమతించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 36 లో ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన ఇళ్లస్థలాలను టీఎన్జీవోలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
 
రెండేళ్లకే పదోన్నతి కల్పించాలి... 
పదోన్నతి కోసం ప్రస్తుతమున్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు కుదించాలని కోరారు. రెవెన్యూ శాఖను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15% పెన్షన్‌ మంజూరు చేయాలని, ఉద్యమంలో పాల్గొన్నందున వాళ్లకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవు ట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సెలవు ప్రయోజనాలను కల్పించాలని, కొత్త జిల్లాలకు సరిపడా క్యాడర్‌ను మంజూరు చేయాలన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు