..ఇలా ఓడిపోయాం! : కాంగ్రెస్ నేతలు

1 Aug, 2014 23:26 IST|Sakshi
..ఇలా ఓడిపోయాం! : కాంగ్రెస్ నేతలు

 ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు
 
సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకపోవడం, నేతల మధ్య సమన్వయలోపం’ పార్టీ కొంపముంచిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి అధిష్టానం కూడా ఒక కారణమని తెగేసి చెప్పింది. అభ్యర్థుల ఎంపికలో సమర్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం, గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొట్టేవారికి టికెట్లు ఇవ్వడం పార్టీ పరాజయానికి దారితీసిందని పార్టీ నేతలు ఏకరువు పెట్టారు.
 
తెలంగాణ క్రెడిట్ తమదేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని, మేనిఫెస్టో కూడా ఓటర్ల దరికి చేర్చలేకపోయామని వాపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలపై శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా నేతలతో పోస్టుమార్టం నిర్వహించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం సెగ్మెంటు నేతలతో వేర్వేరుగా నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక పరిస్థితులు, పనితీరుపై ఆయా నేతలు ఏకరువు పెట్టారు.
 
చతికిలపడ్డాం..
‘కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఇతర పార్టీలకు లేదు. కానీ సొంత పార్టీ నేతలు వ్యతిరేకంగా పనిచేసినందునే ఓటమిపాలయ్యాం’ అంటూ సమావేశంలో పలువురు నేతలు ముక్కుసూటిగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందినట్లు నేతలు ముక్తకంఠంతో మనసులోమాటను బయటపెట్టారు.
 
అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య సమన్వయం కొరవడిందని, దీంతో ఇతర పార్టీలకు ఇది అదనుగా మారడంతో ఓటమి చెందామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత తమదేననే అంశాన్ని ప్రజలకు వివరించలేకపోయామని, అయితే టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవడంతో విజయం సాధించారని విశ్లేషించారు. జిల్లాలో విభిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లున్నారని, వీరిపై టీఆర్‌ఎస్ వ్యూహరచన ఫలించిందన్నారు.ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరితో ప్రజలు ఆలోచనలో పడ్డారని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని పూర్వవైభవం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.
 
ప్రత్యేక పరిస్థితులతోనే : సబిత
జిల్లాలో నెల కొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చినట్లు మాజీమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని, మోడీ ప్రభావం బాగా పనిచేసిందని,  దీంతో ఆ పార్టీలకు అధికంగా సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
 
జనాదరణలేని వారికి టికెట్లు : మల్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధిష్టానం ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులకు కాకుండా ఏమాత్రం జనాదరణలేని పైరవీకారులకు పెద్దపీట వేయడంతో పార్టీ పరాభవం చెందిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్వంలో తనకు టికెట్ ఖ రారులో జాప్యం జరిగిందని, ఇది తన గెలుపుపై ప్రభావం చూపిందని వాపోయారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కాలె యాదయ్య (చేవెళ్ల), టి.రామ్మోహన్‌రెడ్డి(పరిగి)లను టీపీసీసీ చీఫ్ పొన్నాల అభినందించారు.
 
సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉంది : ప్రసాద్‌కుమార్
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన పని లేదని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. కానీ కార్యకర్త స్థాయిలో నూతనోత్సాహంతో వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లిల్సి ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉందని, అనుకూలంగా మలుచుకోవడంలో మనం చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, పి.కార్తీక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు వెంకటస్వామి, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, డీసీసీబీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, భీంరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు