రుణమాఫీ చేసి తీరుతాం

26 Jun, 2014 00:40 IST|Sakshi
రుణమాఫీ చేసి తీరుతాం

- వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం
- జిల్లాలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి
- 500 జనాభా ఉన్న తండాలను జీపీలుగా మారుస్తాం
- కూరగాయల జోన్ ఏర్పాటుకు కృషి
- 111 జీఓ ఎత్తివేతకు ప్రయత్నిస్తాం
- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
- చేవెళ్లలో ఘనంగా సన్మానం
 చేవెళ్ల:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీచేసి తీరుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిన జీఓ 111ను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వెల్లడించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా మున్ముందు  ఐటీ, ప్రారిశ్రామిక రంగాల్లో గణనీయ పురోగతి సాధిస్తుందన్నారు.

ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, రైతుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు అందేలా చూస్తామని చెప్పారు. 500 పైబడి జనాభాఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30నుంచి 50 డిపోల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, చేవెళ్లలోనూ బస్‌డిపో ఏర్పాటు చేస్తామని అన్నారు.

ప్రతి గ్రామానికీ బస్సు నడిపిస్తామని, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా నాయకులు సత్యనారాయణరెడ్డి, స్వప్న, ఎస్.వసంతం, కే.మహేందర్‌రెడ్డి, సామ మాణిక్‌రెడ్డి, పురుషోత్తం, ఆర్టీసీ టీఎంయూ జిల్లా కార్యదర్శి ఎం.భుజంగరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు వై.శ్రీరాంరెడ్డి, ఎం.మాణిక్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కే.సుధాకర్‌రెడ్డి, శంభారెడ్డి, జడల రాజేందర్‌గౌడ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు