రెండేళ్లలో మణుగూరు.. మూడేళ్లలో కొత్తగూడెం

24 Sep, 2014 02:15 IST|Sakshi
రెండేళ్లలో మణుగూరు.. మూడేళ్లలో కొత్తగూడెం

విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తాం  ప్రభుత్వానికి భెల్ హామీ 
1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులు అప్పగింత


రెండేళ్లలో మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మించి ఇస్తాం!
మూడేళ్లలో 800 మెగావాట్ల
విద్యుత్ ప్లాంటును పూర్తిచేస్తాం!!


ఇదీ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఇచ్చిన హామీ. మంగళవారం తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు భెల్ సీఎండీ బీపీ రావు, డెరైక్టర్ అతుల్ సోక్తిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు తీసుకెళ్లి కలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తామని సీఎంకు బీపీ రావు హామీ ఇచ్చారు. తమవద్ద ఇప్పటికే 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు సరిపడ బాయిలర్లు, టర్బై న్లు, జనరేటర్లు (బీటీపీ) సిద్ధంగా ఉన్నందున... కేవలం రెండేళ్లలోనే 1,080 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో మొత్తం 1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులన్నీ అవగాహన ఒప్పందం రూపంలో  భెల్‌కు అప్పగించాలని తెలంగాణ జెన్‌కోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అదేవిధంగా రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల నిర్మాణ బాధ్యతలను కూడా అవసరమైతే భెల్‌కే అప్పగించాలని కూడా సీఎం ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం- ప్రభుత్వం (జీ టు జీ) పద్ధతిలో ఎంవోయూ రూపంలో అప్పగించడం ద్వారా టెండర్ల ప్రక్రియకు పట్టే సుమారు పది నెలల కాలాన్ని తగ్గించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి.

ఈపీసీ పద్ధతిలో మొత్తం పనులు!

వాస్తవానికి ప్రస్తుతం జెన్‌కోలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను రెండుగా విభజించి అప్పగిస్తున్నారు. ఒకటి  బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్ల (బీటీజీ) పనులు. ఈ పనులను ప్రస్తుతం కూడా జీ టు జీ కింద భెల్‌కే అప్పగిస్తున్నారు. యాస్ ప్లాంటు, కూలింగ్ టవరు వంటి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ల (బీవోపీ) పనులను మాత్రం టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు. అయితే, ఈ రెండు కంపెనీల మధ్య పరస్పరం అవగాహనతో పనులు జరగకపోవడం వల్ల ప్లాంట్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతోంది. అంతేకాక రెండు సంస్థలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. పెనాల్టీ చెల్లింపులో కూడా ఇదే ఆరోపణలకు దిగుతూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో బీటీజీ, బీవోపీ పనులను కూడా ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా సమన్వయంతో పనులు జరుగుతాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులతో పాటు ఎన్‌టీపీసీ కూడా ఈపీసీ పద్ధతిలోనే ఒకే సంస్థకు మొత్తం విద్యుత్‌ప్లాంట్ల పనులను అప్పగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పద్థతినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.    
 
ఇవీ ప్లాంట్ల వివరాలు!
 
రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల విద్యు త్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద 800 మెగావాట్లు, మణుగూరులో 1,040 మెగావాట్లు, ఇల్లెందులో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లతోపాటు కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 1,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 7,040 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ జెన్‌కో ప్రణాళికలు తయారుచేసింది. ఇందులో భాగంగా మణుగూరులోని ఏడూళ్ల బయ్యారం సమీపంలో సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని గుర్తించింది. ఇక్కడ ఇప్పటికే బెల్ వద్ద సిద్ధంగా ఉన్న 270 మెగావాట్ల ఆరు యూనిట్ల కు సరిపడా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు (బీటీజీ)ను ఉపయోగించి త్వరగా ప్లాంటు సిద్ధమవుతుందని టీజెన్‌కో యోచిస్తోంది. ఇక కొత్తగూడెం వద్ద ఇప్పటికే 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. పూర్తిస్థాయి ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక కూడా సిద్ధమయింది. మొ త్తమ్మీద మెగావాట్‌కు 6 కోట్ల చొప్పున 1,880 మెగావాట్లకు లెక్కిస్తే మొత్తం రూ. 11,280 కోట్ల కాంట్రాక్టు భెల్‌కు దక్కనుంది.
 

మరిన్ని వార్తలు