నిమిషం ఆలస్యమైనా ప్రవేశం నిరాకరణ

12 May, 2017 00:45 IST|Sakshi

నేడు ఎంసెట్‌ పరీక్ష
గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి
ఉదయం 10 నుంచి ఇంజనీరింగ్‌..
మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్, ఫార్మసీ


సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్‌–17 పరీక్ష శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీ రింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి రానివ్వరు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే విద్యార్థుల బయోమెట్రిక్‌ వివరాలను నమోదు చేస్తారని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ.యాదయ్య సూచించారు.

ఏర్పాట్లన్నీ పూర్తి
పరీక్ష నిర్వహణ కోసం ఎంసెట్‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రశ్నపత్రం సెట్‌లను విడుదల చేస్తారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,41,187, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 79,061 మంది.. మొత్తంగా 2,20,248 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

♦ పరీక్ష హాల్లోకి ఒక్కసారి వెళ్లిన అభ్యర్థిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు రానివ్వరు.

♦ విద్యార్థి బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్, పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్‌ను మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.

♦ పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు.

♦  క్యాలిక్యులేటర్, మేథమెటికల్‌/లాగ్‌ టేబుల్, పేజర్, సెల్‌ఫోన్లు, వాచీలు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. తెల్లకాగితాల వంటి వాటినీ తీసుకెళ్లవద్దు.

మరిన్ని వార్తలు