గీసుకున్నా..ఆసుపత్రికే..!

11 Oct, 2014 04:05 IST|Sakshi

పాలమూరు :
 జిల్లాలోని సర్కారు బడుల్లోని చిన్నారులకు చిన్నగాయమైనా దగ్గర్లోని  ఆసుపత్రులకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులకు అత్యవసర వైద్య చికిత్సలు అందించేందుకు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కిట్లు పత్తా లేకుండా పోయాయి. జిల్లా విద్యాశాఖ, ఆరోగ్య శాఖ సమన్వయ లోపం కారణంగా బడుల్లోని చిన్నారులకు ప్రథమ చికిత్సను అందించేందుకు మందులను ఏర్పాటు చేయడంలేదు.

రాజీవ్ విద్యామిషన్ నిధుల ద్వారా మూడేళ్ల క్రితం జిల్లాలోని 450 పాఠశాలలకు ప్రథమ చికిత్స కిట్లు పంపిణీ చేశారు. ఎన్‌పీజీజీఈఎల్ కార్యక్రమంలో భాగంగా రూ. 2వేల విలువైన కిట్లను లెదర్ బ్యాగులతో సహా అందజేశారు. ఇందులో టింక్చర్ అయోడిన్, నొప్పుల నివారణ మాత్రలు, బ్యాండేజీ తదితర సామాగ్రిని సరఫరా చేశారు. అరుుతే కిట్లలో మందుల కాలపరిమితి రెండు నెలల్లోనే తీరిపోయింది. కిట్లు మూలన పడ్డాయి.  

ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాల్సి ఉండగా, జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత, సమన్వయ లోపాలను కారణగా చెప్పుకోవచ్చు. దేశంలో ప్రథమ చికిత్స అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

 జిల్లాలో పరిస్థితి ఇదీ..
 జిల్లాలో 3450 ప్రభుత్వ పాఠశాలల్లో 4.25 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లోనూ  ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విద్యార్థులకు గాయమైతే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు పరుగెత్తాల్సిందే. అవీ లేని ప్రాంతాల్లో ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోవాల్సివస్తుంది. నిధుల లేమి కారణంగా ఫస్ట్‌రుుడ్ కిట్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు చొరవ తీసుకుని కిట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 నామ మాత్రంగా పిల్లల డాక్టర్లు
 విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించి వారి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే కార్యక్రమమే చిన్నారి డాక్టర్. యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాల్సిన చిన్నారి డాక్టర్ ఆరోగ్య క్లబ్బుల కార్యక్రమం నామమాత్రంగా కొనసాగుతోంది. రాష్ట్రీయ బాల్య స్వాస్థ్య అభియాన్ ద్వారా చిన్నారి డాక్టర్ కార్యక్రమం అమలుకు ప్రణాళికలు రూపొందించారు.

ఇందుకుగాను జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిన్నారి డాక్టర్లుగా విద్యార్థులను ఎంపిక చేసి ఒక క్లబ్బు ఏర్పాటు చేయాలి. సంపూర్ణ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. ప్రథమ చికిత్స వంటి అంశాలపైనా అవగాహన కల్పించాలి. గత ఏడాది కార్యక్రమం ప్రకటించినా ఇప్పటివరకు ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు లేవు.

 కిట్ల ఏర్పాటుకు చర్యలు:  డీఈఓ
 ఈ  విషయమై జిల్లా  విద్యాశాకాధికారి చంద్రమోహన్‌ను  వివరణ కోరగా జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు