దొంతీ .. కరుణచూపు

27 May, 2014 03:18 IST|Sakshi
దొంతీ .. కరుణచూపు

 సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించుకునేందుకు సోమవారం ముఖ్య నేతలు చర్చలు జరిపారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే దొంతి సహకారం అవసరం కావడంతో జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఇనుగాల వెంకటరాంరెడ్డి, పొదెం వీరయ్య కలిసి దొంతితో సమావేశమై హరిత హోటల్‌లో చర్చలు జరిపారు. 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 24, టీఆర్‌ఎస్‌కు 18, టీడీపీకి 6, బీజేపీకి 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు.

తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అవకాశం ఉన్న ఏ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా వదలకూడదనే పట్టుదలతో ఉండడంతో జిల్లాలో దొంతి కరుణ  తప్పనిసరి అయింది. మాధవరెడ్డి ఇంటికి గండ్ర తప్ప ముఖ్య నాయకులందరూ వెళ్లి మొదట చర్చలు జరిపిన తర్వాత హరిత హోటల్‌కు వేదిక మార్చారు.
 
 చర్చల్లో వచ్చిన అంశాలను కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి నుంచి ప్లాన్ ప్రకారం గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులను మాధవరెడ్డి 10మందిని తన వద్ద ఉంచుకున్నారు. జెడ్పీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం మాధవరెడ్డి సహకారం అవసరమైంది. దీనికి ప్రతిఫలంగా మాధవరెడ్డిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దొంతి జెడ్పీ పీఠం తన నియోజకవర్గానికే కావాలని, జిల్లా అధ్యక్ష పదవి కూడా తనకే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు.
 
 ఈ ప్రతిపాదనను దుగ్యాల శ్రీనివాసరావు వ్యతిరేకించారు. మొదట తన నియోజకవర్గానికి జెడ్పీ పీఠం కావాలని డిమాండ్ చేయడంతో పాటు దొంతికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. అయితే మాధవరెడ్డి మెట్టుదిగకపోవడంతో చివరకు జెడ్పీ పీఠం ఆయన నియోజకవర్గానికే కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు మాత్రం ప్రస్తుత ఇన్‌చార్జి నాయిని, దుగ్యాల, గండ్ర అంగీకరించకపోవడంతో దొంతి కొంత సానుకూలత చూపారు.

 టీఆర్‌ఎస్ పార్టీకి జెడ్పీ పీఠం దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు దొంతిని పార్టీలోకి తీసుకుని జెడ్పీ చైర్మన్ పదవి అప్పగించేందుకు సానుకూలత చూపారు. అయితే మంగళవారం మరో దఫా జరిగే చర్చల్లో స్పష్టత రానుంది. నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న దొంతి తనపట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన దొంతికి మళ్లీ అదే పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

మరిన్ని వార్తలు