పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం

7 Nov, 2014 03:21 IST|Sakshi
పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం

* తొలి దశలో 12 వేల మందికి..
* మూడు రంగుల్లో కార్డులు  
* నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం  
* ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పంపిణీ  
* మిగిలిపోయిన కుటుంబాల సమగ్ర సర్వే కొనసాగింపు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 8 నుంచి 12 వేలమందికి పింఛన్లు ఇవ్వడానికి నిర్ణయించారు. పంపిణీలో నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన అనంతరం అధికారులు పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమగ్ర సర్వే అనుసంధానంతో ఎంపికైన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ నుంచి పెంచిన వాటిని కలుపుకుని... వృద్ధులు, వితంతువులకు రూ.1000,  వికలాంగులకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తారు.  

జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 500 చొప్పున 8 వేలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో 4 వేల మందికి పింఛన్లు పంపిణీ చే సే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి.  మరోపక్క సామాజిక పింఛన్ల దరఖాస్తుల వెరిఫికే షన్ కార్యక్రమాన్ని ఈ నెల 15 వరకు కొనసాగిస్తూనే..పంపిణీ ప్రక్రియ దశలవారీగా కొనసాగేటట్టు అధికారులు తగిన ప్రణాళిక రూపొందించారు.

మూడు రకాల కార్డులు..
పింఛన్ లబ్ధిదారుల కోసం  మూడు రకాల  కార్డులను ముద్రించారు. వృద్ధుల కోసం ‘ఆసరా’ పేరుతో పింక్ కార్డులు, వితంతువుల కోసం బ్లూ కార్డులు, వికలాంగుల కోసం గ్రీన్ కార్డులను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముద్రించారు. వీటిని పంపిణీ సమయంలో ఆయా లబ్ధిదారులకు అందచేస్తారు.
 
వెరిఫికేషన్ 85 శాతం పూర్తి
సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 1,35,429 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ పరిధిలో1,10,292 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో దరఖాస్తుల పరిశీలన 85 శాతం వరకు పూర్తయిందని, మిగతావి ఈ నెల 15 వరకు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
 
మిగిలిన కుటుంబాల సర్వే షురూ..

నగరంలో గతంలో సర్వే చేయని కుటుంబాల కోసం మరోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. నగరంలో దాదాపు 1.60 లక్షల కుటుంబాలు గతంలో నిర్వహించిన సర్వే పరిధిలోనికి రాలేదని భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 53 వేల కుటుంబాలు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో 1.07 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాలేదని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో  1400 మంది ఉపాధ్యాయులు  సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఇది పూర్తికావచ్చని భావిస్తున్నారు.
 
‘నిబంధనల’ టెన్షన్
నిబంధనలు, కొత్త మార్గదర్శకాల కారణంగా గ్రేటర్ పరిధిలో భారీస్థాయిలో పింఛన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో 60 శాతానికి మించి పింఛన్లు మంజూరు చేయకూడదని పేర్కొంటూనే....కేటగిరీల వారిగా వద్ధాప్య పింఛన్లు 7 శాతం, వితంతు 5, వికలాంగులవి 3 శాతం మాతమే ఉండాలని ఇటీవలి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించటం పెన్షన్‌దారులను టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా గ్రేటర్ పరిధిలో 2.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన నేపథ్యంలో 1.43 లక్షలకు మించి లబ్ధిదారుల ఎంపిక ఉండక పోవచ్చునని తెలుస్తుంది. ఈ లెక్కన 60 శాతం నుంచి 63 శాతానికి మించి లబ్ధిదారుల ఎంపిక ఉండటం లేదని తెలుస్తున్నది.

మరిన్ని వార్తలు