నేడు 21 సదస్సులు

30 Nov, 2017 03:16 IST|Sakshi

జీఈఎస్‌లో ఆఖరి రోజైన గురువారం 21 కీలక సదస్సులు జరగనున్నాయి. పెట్టుబడులు విజయాలు, ఔత్సాహిక పెట్టుబడిదారులనే అంశంపై ఉదయం 9 గంటలకు చర్చాగోష్ఠితో సదస్సు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ‘మహిళలు విజయం సాధిస్తే.. అందరూ విజయం సాధించినట్లే’ అనే ఇతివృత్తంపై ముగింపు చర్చ జరుగుతుంది. ‘మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రోత్సాహం’ అనే అంశంపై చర్చిస్తారు. కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభు ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరిస్తారు.

ఐయూరప్‌ కాపిటల్‌ సహ వ్యవస్థాపకులు క్రిస్టినా పెర్కిన్‌ డెవీసన్, వెల్‌స్పన్‌ ఇండియా జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపాలీ గోయంకా, యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవెలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌ మార్క్‌ గ్రీన్,పెట్రోలింక్‌ సీఈవో లెరాటో మోత్సమయి, టీమ్‌ లీజ్‌ చైర్మన్‌ మనీష్‌ సభర్వాల్‌ పాల్గొంటారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్, టీ హబ్‌ సీఈవో జయదీప్‌ కృష్ణన్, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, ఇంటెల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ నివృతి రాయ్, ఇండియా టుడే గ్రూప్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కలైపురి, మేక్‌మై ట్రిప్‌.కామ్‌ సీఈవో దీప్‌ కల్రా, ఓయో రూమ్స్‌ సీఈవో రితేష్‌ అగర్వాల్‌ వివిధ సదస్సుల్లో పాల్గొంటారు.


స్టార్టప్‌ల ఫైనల్‌ పోటీ.. విజేతల ప్రకటన
జీఈఎస్‌ను పురస్కరించుకొని స్టార్టప్‌లకు నిర్వహించిన కాంపిటేషన్‌కు సంబంధించిన ఫైనల్‌ పోటీ ఉత్కంఠ రేపనుంది. సెమీ ఫైనల్‌కు చేరిన 24 మంది స్టార్టప్‌ కంపెనీ యజమానుల నుంచి నాలుగు ప్రాధాన్య రంగాల్లో ఒక్కొక్కరిని ఫైనలిస్టులుగా ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది పోటీలో ప్రతిభ కనబరిచిన ఒక్కరిని న్యాయ నిర్ణేతలు గ్రాండ్‌ ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. గురువారం సాయంత్రం జరిగే ముగింపు వేడుకపై విజేతలకు బహుమతులను అందజేస్తారు. గ్రాండ్‌ ఛాంపియన్‌గా నిలిచిన స్టార్టప్‌కు దాదాపు 4 లక్షల డాలర్ల బహుమతులు అందిస్తారు.

నోవాటెల్‌లో అమెరికా విందు
ప్రపంచ సదస్సులో ఆఖరి చర్చాగోష్ఠి ముగిసిన వెంటనే స్టార్టప్‌ల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తారు. ఇదే వేదికపై సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ అమెరికా ప్రభుత్వం విందుకు ఏర్పాట్లు చేసింది. నోవాటెల్‌ లాన్స్‌లో ఈ ఆతిథ్యం ఇవ్వనుంది. అతిథుల నోరూరించేలా వివిధ దేశాలకు చెందిన ప్రఖ్యాత వంటకాలను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు