సభ్యత్వంపై నిస్తేజం

2 Dec, 2014 01:59 IST|Sakshi
సభ్యత్వంపై నిస్తేజం

మొక్కుబడిగా సాగుతున్న
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
నేడు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పొన్నాల రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు అధిష్టానం చేపట్టిన ఈ కార్యక్రమానికి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఇన్‌చార్జీలు లేని నియోజకవర్గాలే కాదు, అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు జిల్లా నాయకత్వంలో గ్రూపు విభేదాలు ఇంకా రగులుతూనే ఉండటంతో ఈ సభ్యత్వ నమోదుకు ప్రధాన అవరోధంగా తయారైంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జీలు సభ్యత్వ నమోదు పుస్తకాలను ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు అప్పగించి వెళ్లిపోయారు.

కనీసం వీరు నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండకపోవడంతో కార్యకర్తలు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో సభ్యత్వ నమోదు పలుచోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్కో బూతుకు 50 చొప్పున సభ్యత్వాలు చేయించాలని నిర్ణయించారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది నుంచి 15 వేల చొప్పున నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నెల తొమ్మిది వరకు నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా నేతలు చొరవ చూపాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గత 15న నిర్మల్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందే ఆసిఫాబాద్‌లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఎక్కడ కూడా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా డిసెంబర్ నెలాఖరు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది.
 
ఇన్‌చార్జీలు లేనిచోట్ల..
జిల్లాలో ప్రస్తుతానికి మూడు నియోజకవర్గాలకు నాయకులెవరూ లేకపోవడంతో ఇక్కడ సభ్యత్వ నమోదు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన కె.ప్రేంసాగర్‌రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ సభ్యత్వ నమోదు బాధ్యతను తీసుకునే నాయకుడే లేకుండాపోయారు. ద్వితీయ శ్రేణి నేతలు జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి వంటి నేతలు ఈ కార్యక్రమాన్ని షురూ చేసినా మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు.

ఇక మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి.అరవింద్‌రెడ్డి కూడా ఎన్నికలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఈ సభ్యత్వ నమోదును భుజాన వేసుకునే నాయకుడెవరూ లేకుండా పోయారు. ఒకవేళ ఎవరైనా ఈ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చినా తీరా పదవులు, టిక్కెట్లు తమకు దక్కుతాయనే ధీమా కనిపించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు.

ద్వితీయ శ్రేణి నాయకులే అడపాదడపా సభ్యత్వాలు చేయిస్తున్నారు. ముథోల్‌లో నియోజకవర్గంలో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఈ కార్యక్రమం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో తప్పకుండా తనకే టిక్కెట్టు దక్కుతుందనే భరోసా లేకపోవడంతో ఈ ప్రక్రియపై శ్రద్ధ వహించడం లేదు. రెండు, మూడు చోట్ల మినహా జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు