నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత

30 Jun, 2016 12:07 IST|Sakshi
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత

గోదావరిలోకి పెరగనున్న నీటి ప్రవాహం
త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల
 

 భైంసా : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం  లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగీడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది.


గోదావరి నదిలో వర్షపు నీరు..
వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. పక్షం రోజుల వరకు బాసర వద్ద పుణ్యస్నానాలకు కూడా నీరు కనిపించలేదు. గోదావరి నదిలో బావులు తవ్వి ఆలయానికి, గ్రామానికి, ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు నీటిని పంపించారు. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది.


 ఎస్సారెస్పీకి నీరు..
 ఇక వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్నారు. నీరంతా ఎస్సారెస్పీలోకి చేరనుంది. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి చేరనుంది. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు.


 రైతుల ఆశలు..
 ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరు అందుతుంది. తీవ్ర వర్షాభావంతో ఈ రైతులంతా గతేడాది నష్టపోయారు. ఈ యేడు వాతావరణ సూచనలతో వర్షాలు కురుస్తాయని ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో ఎలాగైనా ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కురుస్తున్న వర్షాలకుతోడు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎస్సారెస్పీలో నీరు చేరితే తాగు, సాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి. 

>
మరిన్ని వార్తలు