చేప ప్రసాదం పంపిణీ నేడే

8 Jun, 2015 02:38 IST|Sakshi
చేప ప్రసాదం పంపిణీ నేడే

* నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పూర్తై ఏర్పాట్లు
* పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రోగులు
* 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

 హైదరాబాద్: ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభంకానుంది.  మరుసటి  రోజు (9వ తేదీ) రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, వాటర్‌బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు రెండురోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి సహాయకులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందడిగా కనిపించింది. కాగా, చేప ప్రసాదం కోసం తరలివచ్చిన రోగులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారాన్ని అందించాయి. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సోమవారం మధ్యాహ్నం లోపు చేప పిల్లలను అందుబాటులోకి తెస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

దాదాపు 50 వేల చేపలు ముందుగా అందుబాటులో ఉంచుతామన్నారు. అవి అయిపోయే సమయంలో తిరిగి తెప్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెంట్రల్‌జోన్‌తో పాటు నగరంలోని పలు జోన్‌లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులను ఇక్కడ బందోబస్తు విధులకు కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రోగులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు