నేటి నుంచి బడిబాట

7 Jun, 2016 01:52 IST|Sakshi

* ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు కృషి చేయాలి
* అదనపు జేసీ తిరుపతిరావు

విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుదలే లక్ష్యంగా మంగళవారం చేపట్టనున్న ‘బడి బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు జేసీ, తెలంగాణ సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) జిల్లా ఇన్‌చార్జి ప్రాజెక్టుఅధికారి ఎస్.తిరుపతిరావు సూచించారు. బడిబాటకు సంబంధించి విధివిధానాలను వివరించేందుకు హన్మకొండలోని కలెక్టరేట్ నుంచి హెచ్‌ఎంలు, ఎంఈవోలు, సీఆర్‌పీలు, ఐఈఆర్‌టీలు, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లను ఉద్దేశించి ఏజేసీ వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మాట్లాడారు.

బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ పాఠశాల ఏర్పాటు, బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో కనీసం ఐదు శాతం నమోదు సంఖ్య పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఈఓ పి.రాజీవ్ కార్యక్రమ విజయవంతానికి పలు సూచనలు చేశారు.
 
ఇదీ షెడ్యూల్
* అన్ని మండలాల్లోని పాఠశాలల పరిధిలో మంగళవారం నుంచి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎంపీడీవోలు, ఎంఈవోలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాఠశాల స్థాయి లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సమావేశం ఏర్పాటుచేసుకుని బృందాల వారీగా కుటుం బాలను కలవాల్సి ఉంటుంది.

* ఈనెల 8న బుధవారం పాఠశాల స్థాయిలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ఎస్‌ఎంసీ సభ్యులు సమావేశమై విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రణాళిక రూపొందించాలి. ఇంటిం టికి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సభ్యులు వెళ్లి పాఠశాలల్లో పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో చదివి పైతరగతులకు వెళ్లిన విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో సమీపం స్కూళ్లలో చేర్పించాలి.
     

* ఈనెల 9, 10వ తేదీల్లో న ఇంటింటా ప్రచారం చేస్తూ బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడిలో చేర్పించేలా అవగాహన కల్పించాలి. మధ్యలో బడి మానేసిన, అసలే బడికి పోని పిల్లలు, సీడబ్ల్యూఎన్‌ఎన్ పిల్లలను కూడా గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే, తెలంగాణ హరితహారం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపుదలపై చర్చించాలి.
     
* ఈనెల 11న ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయమై తల్లిదండ్రులతో చర్చించి వారు అంగీకరిస్తే ఒకటో తరగతి నుంచి ప్రారంభించాలి. ప్రతీ తరగతికి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో జాబితా రూపొందించాలి.
     
* ఈనెల 12న పాఠశాలల ఆవరణశుభ్రం చేయటంతోపాటు, భవనాలు, బోర్డులకు రంగులు వే యించాలి. తాగునీటి వసతి, తరగతులు, ఉపాధ్యాయుల గదులను శుభ్రం చేయించాలి.
     
* ఈనెల 13న పాఠశాలల అభివృద్ధి కోసం హెచ్‌ఎం, టీచర్లు, ఎస్‌ఎంసీలు సమావేశమై చర్చిం చాలి. అదేరోజు పాఠశాలల్లో విద్యార్థులు పాఠ్యపుస్తకాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంఎసీ సభ్యులతో పంపిణీ చేయించాలి.
     
* ఈనెల 14న గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాలి.
     
* ఈనెల 15న అంగన్‌వాడీ కార్యకర్తలను కలిసి సెంటర్లలోని పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. ప్రాథమిక పాఠశాలల్లో చదువు పూర్తిచేసిన పిల్లలను యూపీఎస్‌ల్లో, అక్కడ పూర్తయిన వారిని హైస్కూళ్లలో చేర్పించాలి.
     
* ఈనెల 16న ఒకటో తరగతి పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస విషయమై ప్రచారం చేయా లి. కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆహ్వానించి పల కలు, నోట్‌బుక్కులు, పెన్సిళ్లు సిద్ధం చేయాలి.
     
* ఈనెల 17న ప్రతీపాఠశాలలో ఉదయం 10గంటలకు ఒకటో తరగతి పిల్లలకు సామూహిక అక్షరాభాస్యం చేయించాలి. కమ్యూనిటీ సపోర్టుతో ఉచితంగా పలకలు, నోట్‌బుక్కులు, పెన్సిళ్లును అందజేయాలి. మిగతా తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి.

మరిన్ని వార్తలు