నేడు ఆసరా పథకం ప్రారంభం

8 Nov, 2014 03:32 IST|Sakshi

ఖమ్మం జెడ్పీసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆసరా పథకం శనివారం  ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి టి.పద్మారావు చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో ఖమ్మం నియోజకవర్గ లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు.

అనంతరం కూసుమంచి మండలం కేంద్రంలో ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. మొదటిగా నియోజకవర్గానికి వెయ్యిమందికి పింఛన్లు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆయా ప్రజాప్రతినిధులు పింఛన్లను అందజేయనున్నారు.

9న మండల కేంద్రాల్లో సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. 10న గ్రామస్థాయిలో ప్రారంభించి దశల వారీగా 30 వరకు పూర్తి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా   వృద్ధాప్య, వికలాంగ, వితంతు, కల్లుగీత, చేనేత పింఛన్లకు 3.13 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు 3 లక్షల దరఖాస్తులను పరిశీలించి 2.40 లక్షల మందిని అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 1.12 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

 ఇందులో వృద్ధాప్య పింఛన్లకు 51 వేలు, వితంతు 46 వేలు, వికలాంగులు 12వేలు, చేనేత కార్మికులకు 553, గీత కార్మికులవి 850 దరఖాస్తులను పూర్తి చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 2,44,730 మందికి పింఛన్లు అందేవి. అయితే ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, వాటిని ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి అనర్హులను తొలగించనుంది.

మరిన్ని వార్తలు