పోలీస్ త్యాగం వెలకట్టలేనిది

21 Oct, 2014 03:08 IST|Sakshi
పోలీస్ త్యాగం వెలకట్టలేనిది

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను సదాస్మరిస్తాం. అమరుల స్మత్యర్థం ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినా తక్కువే. సమాజాభివృద్ధిలో పోలీస్ త్యాగం వెలకట్టలేనిది’ అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అక్టోబర్  21 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పోలీస్ సంక్షేమం, అమరుల కుటుంబాలకు శాఖపరంగా అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ‘సాక్షి’కి సోమవారం వివరించారు.

ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే...
‘ప్రజల భద్రతే లక్ష్యంగా వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వని అరుదైన శాఖల్లో పోలీస్‌శాఖ ప్రధానమైంది. జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా శత్రువుతో రాజీలేని పోరాటం చేశాం. ప్రజా శ్రేయస్సు కోసం సత్ఫలితాలను సాధించాం. జిల్లాలో దాదాపు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. జిల్లా పోలీసుల సమష్టి కృషి, త్యాగనిరతికి ఇది నిదర్శనం. జిల్లాలో దాదాపు 40 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. వారి కుటుంబాలకు పోలీస్‌శాఖ అండగా ఉంటోంది. వారి కుటుంబసభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నాం.

వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నాం. జిల్లా పోలీస్ అధికారుల సంఘం సైతం వారికి అనుక్షణం అందుబాటులో ఉంటుంది. 1996 కంటే ముందు మరణించిన పోలీసులకు సంబంధించి వారి కుటుంబాలు అడుగుతున్న  ప్రభుత్వపరమైన రాయితీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకుగాను అడిషనల్ ఎస్పీ, పోలీస్ అధికారుల సంఘం అమరవీరుల కుటుంబాలకు చెందిన వారితో కలిసి రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి సమస్యలను వివరిస్తాం. 1996 కంటే ముందు మరణించిన పోలీస్ అమరుల కుటుంబాలకు కేవలం ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.

ఇతర ఆర్థిక ప్రయోజనాలేవీ నెరవేరలేదు. ఈ విషయాన్ని హోంమంత్రికి ప్రతినిధి బృందం నివేదిస్తుంది. విద్యార్థులకు పోలీస్‌శాఖ విధి నిర్వహణపై అవగాహన కల్పించాం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా రక్తదానం, వ్యాసరచన, వక్తృత్వం, క్రీడాపోటీలు, ఓపెన్‌హౌస్, సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం విజయవంతానికి పోలీస్‌శాఖ కూడా విశేషంగా కృషి చేస్తోంది. పోలీసు అమరుల కుటుంబాలకు సంబంధించిన ప్రతి సమస్యనూ పోలీస్ కుటుంబ సమస్యగానే భావిస్తాం. అమరుల కుటుంబాలకు ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల్లో రెండుశాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇతర ఉద్యోగాల్లోనూ దీన్ని అమలు చేయాలనే డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వ దృష్టిలో ఉంది’ అన్నారు.

మరిన్ని వార్తలు