సమీక్షకు రండి

24 Jul, 2014 02:55 IST|Sakshi

భద్రాచలం : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి బదలాయించబడిన ముంపు మండలాల్లో పాలన ఎవరు పర్యవేక్షించాలనే దానిపై నేటికీ స్పష్టత లేదు. ఏడు మండలాల బదలాయింపుపై రాష్ట్రపతి రాజముద్ర  వేసినప్పటకీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఒక అవగాహనకు రాకపోవటంతో ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ ప్రభావం ఇక్కడ పనిచేస్తున్న అధికారులపై కూడా పడుతోంది. తాము ఎటువైపు అనేది ఇంకా తేలకపోవటంతో వారిలో అయోమయం నెలకొంది.

ఈ సందిగ్దతలో కొట్టుమిట్టాడుతున్న ముంపు ఉద్యోగులను ఆంధ్ర రాష్ట్ర అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలు మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. బుధవారం భద్రాచలం డివిజన్‌లోని ముంపు మండలాల అధికారులకు కాకినాడ కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు ఉదాహరణ. భద్రాచలం రూరల్, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండల స్థాయి అధికారులంతా గురువారం రంపచోడవరంలో జరిగే ఐటీడీఏ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.

రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తగిన కార్యాచరణ, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా  కలెక్టర్ అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షిస్తారని, ఈ సమావేశానికి రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని మండలాల అధికారులంతా హాజరుకావాలని సూచించారు. అయితే భద్రాచలం రూరల్ , కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల పాలన ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచే కొనసాగుతోంది.

 ఇక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాము ఆంధ్రకు వెళ్లేది లేదని ముంపులోని అధికారులు, ఉద్యోగులు చెపుతున్నారు. కానీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌ల నుంచి సమావేశాలకు హాజరుకావాలంటూ లేఖలు వస్తుండటంతో వారు ఒకింత ఇరకాటంలో పడుతున్నారు.

 తెలంగాణ ప్రభుత్వ  ఆదేశాలు ఉండాల్సిందే...
 ముంపు ఉద్యోగులకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌ల నుంచి సమావేశాలకు పిలుపు వస్తున్నప్పటికీ, అక్కడకు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందేనని జిల్లా అధికారులు చెపుతున్నారు. కానీ ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులకు జూలై నెల వేతనాలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ అధికారులు తీసుకోవటం లే దు. అంటే ముంపులో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ వారా..? లేక ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ విషయమై డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదు. ఇది ముంపు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

 ముంపులో స్తంభించిన పాలన
 ముంపు మండలాల్లో పాలన పూర్తిగా స్తంభించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులే ఉన్నప్పటికీ ఆంధ్రకు వెళ్లిపోయే మండలాల్లో ఏ మేరకు పనులు చేపట్టాలనే దానిపై వారిలో సందిగ్దత నెలకొంది. ఇప్పటికే అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు ఆగిపోయింది. ముంపు మండలాల్లో ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వర్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తేనే ఉపాధి కూలీలకు బిల్లులు మంజూరవుతాయి. వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు బిల్లులు అవుతాయో లేదో అనే భయంతో కాంట్రాక్టర్‌లు వాటిని చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.

 ముంపు మండలాల నివేదికలను ఏ క్షణాన అడిగినా ఆంధ్ర అధికారులకు అప్పగించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసి ఉంచింది. కానీ ఉద్యోగుల పరిస్థితి ఏంటనే దానిపైనే సవాలక్ష సందేహాలు ఉన్నాయి. ఆంధ్ర అధికారులు పిలిచినా వెళ్లేందుకు నిరాకరిస్తున్నప్పటకీ, భవిష్యత్‌లో తమను అటువైపే కేటాయిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ అయోమయానికి తెరదించేందుకు ఇప్పటికైనా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించి తమకు ఊరట కలిగించాలని ముంపు ఉద్యోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు