నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

14 Jun, 2018 01:56 IST|Sakshi
తెలంగాణ సీఎం కేసీఆర్‌

రేపు ప్రధాని మోదీతో భేటీ 

కొత్త జోన్లు, రిజర్వేషన్ల కోటాపై చర్చ

 పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలపైనా.. 

‘ఫ్రంట్‌’ప్రకటన తర్వాత  ఇదే తొలి భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను చర్చిస్తారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్‌ కలవనున్నట్లు తెలుస్తోంది. గతనెల 27న ప్రధానిని కలిసేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. కానీ విదేశీ పర్యటనకు వెళ్లే బిజీలో ఉన్నందున ప్రధాని అపాయింట్‌మెంట్‌ లభించకపోవటంతో మరుసటి రోజునే వెనుదిరిగారు. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు, పాత జోనల్‌ వ్యవస్థలో మార్పులపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే ప్రతిపాదనలకు గత నెలలోనే రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించింది కావటంతో ఈ అంశంపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. దీంతోపాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల కోటా పెంపు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక సాయంతోపాటు విభజనకు సంబంధించి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రైతులకు పెట్టుబడి సాయం, రూ.5 లక్షల రైతు బీమా పథకం అమలుపై ప్రధాని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ ప్రధానిని కలిసిన సందర్భంగా ఈ విషయం ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం ఈ రెండు పథకాల అమలు తీరును ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి. మరోవైపు కేసీఆర్‌ గత రెండు నెలలుగా జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత కేసీఆర్‌ తొలిసారిగా ప్రధానిని కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

గవర్నర్‌తో భేటీ 
సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లనున్నందున ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ భేటీలో గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు