శ్రీ సీతారాముల కల్యాణం..టీవీలో చూతము రారండి!

2 Apr, 2020 04:52 IST|Sakshi
బుధవారం రాత్రి విద్యుత్‌ కాంతుల్లో భద్రాద్రి రామాలయం

నేడే శ్రీరామ నవమి 

అత్యంత నిరాడంబరంగా భద్రాద్రిలో స్వామివారి కల్యాణం 

ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం.. ఇంట్లో నుంచే భక్తుల వీక్షణ  

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్‌: ఊరూరా.. వాడవాడలా కన్నుల పండువగా జరిగే శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక సూచనలు చేసింది. భక్తులు రాకుండా కేవలం అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఒకరిద్దరు ఆలయ ధర్మకర్తల సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి విచ్చేసి రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేవారు. కానీ ఈసారి టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవా రు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు.

నేడు కల్యాణం.. రేపు పట్టాభిషేకం 
శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి సంబంధించి గురువారం తెల్లవారు జామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం నిర్వహించనున్నారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం జరిపి అంతరాలయంలోని ధ్రువమూర్తులకు అభిషేకం జరుపుతారు. తర్వాత «మూలమూర్తులకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రజిత సింహాసనంపై ఆశీనులను చేస్తారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరిస్తారు. వేదికపై ఆశీనులైన శ్రీ సీతారాములకు  సంకల్పం చెప్పి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర, బెల్లం స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలపై ఉంచుతారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని చేస్తారు. అనంతరం ఎర్రని తలంబ్రాలతో వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

అన్ని దేవాలయాల్లోనూ ఇలాగే..
భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం మొ దలు మారుమూల పల్లెల్లోని దేవాలయాల వర కు కేవలం అన్నిచోట్లా ఆలయ కార్యక్రమంగానే స్వామి కల్యాణాన్ని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయా న్ని ఇప్పటికే దేవాదాయశాఖ అన్ని దేవాలయాలకు సూచించగా, తెలంగాణ విద్వత్సభ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. స్వయంగా కల్యాణం లో పాల్గొనాలనుకునే భక్తులు కార్యక్రమాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని, ఇతరులను ఆహ్వానించవద్దని అధికారులు సూచించారు. ఈసారి పానకం, వడపప్పు అందించటం, అన్నసంతర్పణ చేయటాన్ని నిషేధించారు. 

మరిన్ని వార్తలు