నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

17 Sep, 2014 02:17 IST|Sakshi

నిర్మల్ అర్బన్ : పోరాట యోధుల ఖిల్లాగా.. పోరాటాల పురిటిగడ్డగా ప్రపంచ చరిత్రలో నిర్మల్‌కు ప్రాముఖ్యత ఉంది. నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటానికి తొలుత జీవం పోసింది ఇక్కడే. నిర్మల్ కేంద్రంగా సాయుధ పోరాటం తీవ్రంగా సాగింది. అప్పట్లో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా జిల్లాకు చెందిన అనేక మంది పోరాట యోధులు నిర్మల్‌ను కేంద్రంగా చేసుకొని ఉద్యమాన్ని నడిపించారు. రహస్య పోరాటాలు చేశారు. నాటి పోరాట యోధుల స్మృతిచిహ్నాలు నేటి వరకూ సజీవంగా దాచుకుని తమదైన ఉద్యమ స్ఫూర్తిని వెలిగిస్తున్నారు నిర్మల్ వాసులు.

 రాంజీగోండ్‌ను ఆదర్శంగా తీసుకొని..
 పోరాట యోధుడు రాంజీగోండ్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సాయుధ పోరు సాగించారు. రాంజీగోండ్ నేతృత్వంలో ఆనాడు జిల్లాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆయన నేతృత్వంలో అనేక మంది గిరిజన యువకులతోపాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని భారీ సంఖ్యలో సమీకరించి పోరు జరిపారు. నిర్మల్, ఉట్నూర్, సిర్పూర్‌తోపాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, యావత్‌మాల్, మాహోర్, తదితర ప్రాంతాల్లో రాంజీగోండ్ ఆధ్వర్యంలో ఆంగ్లేయుల సైనికులపై దాడులు చేసి వారి గుండెల్లో గుబులు రేపారు.

ప్రధానంగా అప్పట్లో సురక్షిత ప్రాంతంగా నిర్మల్ ఉండడంతో ఇక్కడి నుంచే పోరాటం నడిపించేందుకు వ్యూహరచనలు సాగించారు. అంతేకాకుండా ఆయుధాల స్థావరాలుగా కూడా ఏర్పర్చుకున్నారు. జరుగుతున్న పోరును అణచివేసేందుకు ఆంగ్లేయులు వివిధ రూపాల్లో పన్నాగాలు పన్నారు. దాంట్లో భాగంగానే కొందరు నజరానాలకు ఆశపడ్డారు. రాంజీగోండు కదిలికలను చేరవేశారు.

దీంతో నిర్మల్ శివారులోని సోన్ గ్రామ సమీపంలో గోదావరి నది వద్ద మాటు వేసి 1857 సెప్టెంబర్ 17న రాంజీగోండ్‌తోపాటు ఉద్యమకారులను సైనికులు పట్టుకున్నారు. పట్టుబడ్డ రాంజీగోండ్‌తోపాటు పోరాట యోధులను నిర్మల్ మండలం ఎల్లపెల్లికి వెళ్లే దారిలో పట్టణ శివారులోని ఖజానా చెరువు వెనుకభాగంలో ఉన్న భారీ మర్రి చెట్టుకు  వెయ్యిమందిని ఉరితీశారు. అందుకే ఈ మర్రిచెట్టును వెయ్యి ఉరుల మర్రిగా పిలుస్తుంటారు. అయితే.. కాలక్రమేణ గతంలో వచ్చినభారీ ఈదురుగాలులకు ఈ మర్రిచెట్టు నేలకొరిగింది. రాంజీగోండ్ జరిపిన ఆ నాటి పోరును ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమించి తెలంగాణ విముక్తికి పాటుపడ్డారు.

 తెలంగాణ ప్రజల కష్టాలు అనేకం..
 రజాకార్లు పాలనలో తెలంగాణ ప్రజలు కష్టాలు అన్నీ ఇన్నీ కా వు. అవి తలచుకుంటే చా లు అంతా ఊగిపోయేవాళ్లం. ఎప్పుడు వాళ్ల దురాగాతాలకు అంతం పలికేది అం టూ రహస్య సమావేశాలు జరిపే వాళ్లం. అదును వచ్చిన సమయాల్లో అంతా దాడులకు దిగే వాళ్లం. స్వాతంత్రం వచ్చినా.. తెలంగాణలో జెండా ఎగురలేదు. దీంతో ఉద్యమాలు చేసి రజాకార్లను తరిమికొట్టి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జెండా ఎగుర వేశాం.

మరిన్ని వార్తలు