మా‘నీటి’ పథకం

10 Dec, 2014 03:18 IST|Sakshi
మా‘నీటి’ పథకం

నేడు ఎల్‌ఎండీకి కేసీఆర్ రాక
మంత్రులు, అధికార యంత్రాంగం సైతం
ఉదయం 11.30 గంటలకు సీఎం చేరిక
సిద్దిపేట నీటి సరఫరా పథకం పరిశీలన
కాన్వాయ్ ద్వారా హన్మాజీపల్లె సంపు సందర్శన
గంటకుపైగా ఇంటేక్‌వెల్, పంపుసెట్ పరిశీలన
ఏర్పాట్లు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం

 
బెజ్జంకి/తిమ్మాపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం జిల్లాకు వస్తున్నారు. ఆయనతోపాటు రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు సుమారు రెండు వందల మంది గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు రానున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు స్ఫూర్తిగా నిలిచిన దిగువ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)- సిద్దిపేట నీటి సరఫరా పథకం అమలు తీరును మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. ఈ పథకాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998లో రూ.60 కోట్లతో నిర్మించారు. పర్యటనలో అందులో భాగంగా ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.45 గంటలకు లోయర్ మానేరు డ్యాం వద్దకు చేరుకుంటారు. అప్పటికే రాష్ట్ర మంత్రులు, అధికారులు రోడ్డు మార్గాన అక్కడికి విచ్చేస్తారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి బెజ్జంకి మండలంలోని మైలారం గుట్ట, హన్మాజీపల్లె సమీపంలోని ఇంటేక్‌వెల్ పంపుహౌస్‌లను సందర్శిస్తారు. సుమారు గంటకుపైగా అక్కడే ఉంటారు. ఈ పంపుహౌస్ ద్వారా గత పద్నాగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు విజయవంతంగా నీటిని సరఫరా చేస్తున్న తీరును పరిశీలించడంతోపాటు మంత్రులు, అధికారులకు వివరిస్తారు.

విస్తృత ఏర్పాట్లు..

సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎస్పీ వి.శివకుమార్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులంతా మంగళవారం హన్మాజీపల్లెకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్‌డబ్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు, ఈఈ ప్రకాశ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చంద్‌లాల్, డీఈ వెంకటరమణ, జేఈ నరేందర్‌లను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్‌ఎండీకి విచ్చేసి స్థానిక ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యుల బృందాన్ని, 104, 108 వాహనాలను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. టెంట్లు, కుర్చీలు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ, జెడ్పీ సీఈవో, 24 గంటల విద్యుత్ సరఫరాను ట్రాన్స్‌కో ఏస్‌ఈ, పరిశుభ్రతను డీపీవో, భద్రతను ఎస్పీ చూసుకోవాలన్నారు. సీఎం పర్యటన ప్రాంతంలో అంబులెన్స్, 104, 108 వాహనాలు, మెడికల్ టీంని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇన్‌చార్జి అడిషనల్ జేసీ టి.వీరబ్రహ్మయ్య, జెడ్పీ సీఈవో అంబయ్య, డీఎస్‌వో చంద్రప్రకాష్, ఆర్డీవో చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభ, డీపీవో కుమారస్వామి, టూరిజం అధికారి వెంకటేశ్వర్‌రావు, ఎల్‌ఎండీ ఈఈ కరుణాకర్, క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ జువేరియా, ఏవో రాజగౌడ్, తహశీల్దార్లు కోమల్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్‌స్వామి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు