బ్లడ్ లెస్ బ్యాంకులు!

14 Jun, 2015 01:15 IST|Sakshi
బ్లడ్ లెస్ బ్యాంకులు!

- ఒకరు ఇస్తేనే మరొకరికి రక్తం ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకుల కండీషన్
- ముందుకు రాని దాతలు.. ఇబ్బందుల్లో రోగులు
- నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో:
రక్తానికి రక్తం! ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలో వినిపించే డైలాగ్ అనుకోకండి. అత్యవసర పరిస్థితుల్లో తమకు రక్తం కావాలంటూ బ్లడ్‌బ్యాంకులకు వచ్చేవారికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఇది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులను ‘రక్తహీనత’ జబ్బుపట్టి పీడిస్తోంది. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో అసరాలు తీర్చలేని పరిస్థితి నెల కొంది. బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేనే అవసరమైన గ్రూప్ రక్తం (రక్తానికి రక్తం!) ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకు ఇన్‌చార్జిలు మెలిక పెడుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు చేరుకున్న బాధితులకు రక్తం దొరకని దుస్థితి. ఒక వేళ ఉన్నా ఒక యూనిట్‌కు మించి ఇవ్వడం లేదు. ఉస్మాయాలో ప్రతి నెలా 500 నుంచి 600 యూనిట్ల రక్తం అవసరం.

రోజుకు 40 మంది వస్తే కేవలం పది మందికే సమకూర్చగలుగుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియాకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా..నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. బ్లడ్ బ్యాంకులపై సరైన నియంత్రణ లేక పోవ డం వల్ల ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుం చి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు.

‘మిషన్ టెన్ మిలియన్’
చార్మినార్:
తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వారు ‘మిషన్ టెన్ మిలియన్’ నినాదంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. జూలై 2వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ఈ సొసైటీ ద్వారా అవసరమైనప్పుడల్లా రక్తాని ఉచితంగా అందిస్తున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు.

పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న ఈ సొసైటీ సభ్యులు డాక్టర్ రమణా దండమూడి, మనోజ్ రూపాని, డాక్టర్ సుమన్ జైన్, అలీంబేగ్,  కె. రత్నావళి, డాక్టర్ జె. రాజేశ్వర్, రమా ఉప్పల తదితరులు తలసేమియా బాధితులకు విశేషసేవలందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.  రక్త దానం చేయాలనుకునేవారు, రక్తం అవసరమైన తలసేమియా బాధిత చిన్నారులు సొసైటీ సంయుక్త కార్యదర్శి అలీం బేగ్ (9246534913)ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు