ఇదేం చలి బాబోయ్‌.. !

31 Jan, 2019 02:11 IST|Sakshi

నేడు ఉత్తర తెలంగాణలో తీవ్ర శీతలగాలులు 

24 గంటల్లో భారీగా తగ్గిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు 

రాజధానిలో ఏడేళ్ల తర్వాత తక్కువ ఉష్ణోగ్రతల నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. మూడ్నాలుగు రోజులుగా చలితో జనం గజగజలాడుతున్నారు. జలుబు, దగ్గులతో బాధపడుతున్నారు. కొన్నిచోట్ల స్వైన్‌ఫ్లూ బారిన పడుతున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనద్రోణి బలహీనపడింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో వచ్చే రెండ్రో జులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. దీంతో గురువారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగా రెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

ఇదిలావుండగా గత 24 గంటల్లో చలి రాష్ట్రాన్ని కమ్మేసింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడి పోయింది. హన్మకొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 9 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక్కడ సాధారణ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు కావాలి. హైదరాబాద్, రామగుండంలో 7 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 25 డిగ్రీలు రికార్డయింది.

రాజధానిలోనూ చలిగాలులు
ఉత్తర, ఈశాన్య గాలుల తీవ్రత నగరాన్ని గజ గజ వణికిస్తోంది. దీంతో ఏడేళ్ల అనంతరం జనవరిలో అతి తక్కువగా 9.3 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7 డిగ్రీలు తక్కువ. సహజంగా జనవరి 15 తర్వాత పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగాల్సి ఉన్నా.. ఇటీవలి తుపాను అనంతరం శీతల గాలుల తీవ్రత కొనసాగు తోంది. దీంతో పగటి పూటా తక్కువ ఉష్ణో గ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం 26.7 డిగ్రీలు నమోదైంది. మరో వారంపాటు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. నగరంలో ఒక్కసారిగా అత్యల్ప ఉష్ణోగ్రతల మూలంగా జలుబు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. గుండె, శ్వాస సంబంధ వ్యాధులున్న వారు తప్పనిసరైతే తప్ప చలిగాలిలో బయటికి రావద్దని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. స్వైన్‌ ఫ్లూ తీవ్రత కూడా ఉండటంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో నాలుగు రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలే నమోదు కానున్నాయి.

మరిన్ని వార్తలు