కార్యకర్తలే వెన్నూదన్ను

3 Feb, 2015 02:01 IST|Sakshi
కార్యకర్తలే వెన్నూదన్ను

 ప్రభుత్వ కార్యక్రమాల్లో మమేకం చేసేందుకు కార్యాచరణ
 హైదరాబాద్‌లో నేడు టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం
 పార్టీ వర్గాల్లో విభేదాలపై దృష్టి, జిల్లాల్లో సమన్వయానికి సూచనలు
 టీఆర్‌ఎస్ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్న     సీఎం కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) నాయకత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్న ఆలోచనకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా జరిగినప్పటికీ ఆ తర్వాత అవి పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్‌లో నిస్తేజం ఆవరించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగానే మంగళవారం హైదరాబాద్‌లోని కొంపల్లిలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అన్ని స్థాయిల్లోనూ నేతలకు, కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
 
 పాత, కొత్త కలయికతో కయ్యం
 
 ఎన్నికల ముందు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు తమ అనుచరగణంతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇతర పార్టీల తరఫున ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు కూడా అధికార పార్టీవైపు వచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య పొసగడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త కార్యకర్తల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వర్‌రావు వర్గానికి అప్పటికే జిల్లా నాయకుడిగా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శి వెంకట్రావు అనుచరులకు మధ్య పొసగడం లేదంటున్నారు. హైదరాబాద్‌లోనూ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్ అనుచరులూ కలిసి పనిచేయలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్, వరంగల్ జిల్లా డోర్నకల్‌లోనూ ఎమ్మెల్యేల చేరికతో ఇదే పరిస్థితి తలెత్తుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. నల్లగొండ జిల్లా కోదాడలో నియోజకవర్గ ఇన్‌చార్జికి, పార్టీలోకి వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్గానికి మధ్య పొంతన కుదరడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధ్యక్షుడు ఈ విషయమై పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. కాగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న సీఎం కేసీఆర్ వచ్చే ఏప్రిల్‌లో తిరిగి అధక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముందంటున్న టీఆర్‌ఎస్ వర్గాలు మరో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. సీఎంగా తీరిక లేకుండా గడిపే ఆయన పార్టీ వ్యవహారాలనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కష్టం కనుక తనకు సహాయకారిగా ఉండేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, మంగళవారం నాటి సమావేశంలో ఈ ప్రస్తావన తెస్తారా లేదా అని పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
 
 ప్రభుత్వానికి దూరంగా కార్యకర్తలు
 
 వాస్తవానికి పార్టీ కార్యకర్తల ద్వారానే ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తుంది. కానీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలను ప్రభుత్వంతో మమేకం చేయడంలో నాయకత్వం దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కొందరు ‘ఆసరా’ పెన్షన్ల పథకాన్ని ఉదహరిస్తున్నారు. కేవలం అధికార యంత్రాంగాన్నే నమ్మడం, స్థానిక నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో అవినీతికీ ఆస్కారం ఏర్పడిందని చెబుతున్నారు. పెన్షన్ల విషయంలో చివరకు నాయకులు గ్రామాలకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పుతెచ్చేందుకు ఇకపై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా కార్యకర్తలను వినియోగించుకోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సీఎం దిశా నిర్దేశం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశముంది. సభ్యత్వ నమోదు కూడా మంగళవారం నుంచే మొదలయ్యే వీలుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు పార్టీ అడహక్ కమిటీని ప్రకటించే అవకాశముంది. అదేమాదిరిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర పార్టీ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్‌కు అప్పగించే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు