దృష్టి సారిస్తే మేలు..

9 Oct, 2014 03:42 IST|Sakshi
దృష్టి సారిస్తే మేలు..

- పెరుగుతున్న కంటిలోపాలు
- పౌష్టికాహారం,ఏ-విటమిన్ లోపంతోనే..
- జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరం
- నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం

ఆదిలాబాద్ రిమ్స్ : ఆకాశం నీలంగా ఉందని తెలిసేదెలా..! అడవి పచ్చదనాన్ని సంతరించుకుందని గుర్తించేదెలా..! అందమైన జీవితాన్ని తనివితీరా చూసేదెప్పుడు.. ! జన్మనిచ్చిన అమ్మనాన్నలను ప్రత్యక్షంగా వీక్షిచడంమెలా..! ఇవన్నీ సాధ్యం కావాలంటే కంటి చూపు అవసరం. అందుకే నయనం ప్రధానం అంటారు. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు మనిషి కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు కొందరైతే.. దృష్టిలోపంతో మరికొందరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
 
నయనం ప్రధానం..

మానవ శరీరంలో అన్ని అవయవాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. చాలామందికి విటమిన్-ఏ లోపం, పౌష్టికాహార లేమి, ఇన్‌ఫెక్షన్, మిస్సల్స్ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్ల దృష్టి లోపం ఏర్పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో పుట్టిన పదో నెల నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి విటమిన్-ఏ మందును ఐదేళ్లు వచ్చేదాకా తొమ్మిది డోసులు క్రమం తప్పకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల పేదలకు అవగాహన లోపంతో ఎటువంటి కంటి సమస్యలు వచ్చినా వైద్యులను సంప్రదించకపోవడంతో వారి పిల్లల్లో దృష్టిలోపం ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. అతి సున్నితమైన కళ్లపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
 
జిల్లాలో చికిత్స నిర్వహించే ఆస్పత్రులు..
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రితోపాటు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ కింద మంచిర్యాలలోని సుఖి భోగి సేవా సమితి, బీవీఆర్ చారిటబుల్ కంటి ఆస్పత్రి, బెల్లంపల్లిలోని చారిటబుల్ లయన్స్ ఐ హాస్పిటల్, ఆదిలాబాద్‌లోని శ్రీసాయి నేత్రసేవా వెల్ఫేర్ సొసైటీ, ఆదిలాబాద్ మండలం మావలలోని శేషవ చెన్నవార్ ఐ హాస్పిటల్, ముథోల్‌లోని బోస్లే గోపాల్‌రావ్ ఐ హాస్పిటల్‌లో స్వచ్ఛందంగా కంటి చికిత్స నిర్వహిస్తారు. ఈ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు చేస్తారు. ఆపరేషన్ల అనంతరం కళ్ల జోళ్లు అందజేస్తారు.
 
సకాలంలో గుర్తించపోవడంతోనే...
పిల్లల్లో కంటి జబ్బులను సకాలంలో గుర్తించకపోవడంతోనే దృష్టిలోపం అధికమవుతోంది. వంశపారపర్యం, పౌష్టికాహారం లోపం, కంప్యూటర్లు, టీవీల ముందు, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో పిల్లల్లోనూ దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. ముందుగా పిల్లలు తలనొప్పితో బాధపడుతారు. బోర్డు సరిగా కనిపించదు, ఇంట్లో టీవీని దగ్గరగా వెళ్లి చూస్తారు. వీరిలో క్రమంగా మెల్ల కన్ను వస్తుంది. చిన్న వయసులోనే పరీక్షలు చేసి అద్దాలు వాడకపోతే ఐదేళ్లలోపు అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. సాయంత్రం 5 గంటలు దాటితే వీరికి కళ్లు సరిగ్గా కనిపించవు. ఇలాంటి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం పరీక్షలు చేసి అవసరమైతే అద్దాలు మారుస్తూ ఉండాలి. 18 ఏళ్ల తర్వాత లేజర్ చికిత్స ద్వారా ఆపరేషన్ చేసి దృష్టి లోపాన్ని సవరిస్తారు. ఆ తర్వాత అద్దాలు వాడే అవసరం ఉండదు.
 
జాగ్రత్తలు
     పిల్లల్లో దృష్టిలోపం రాకుండా 9 నెలల వయసులోనే విటమిన్-ఏ అందించాలి.
     పదునైన వస్తువులతో పిల్లలు ఆడుకోవద్దు.
     ఆకు కూరలు అధికంగా పెట్టాలి. క్యారెట్, గుడ్లు, పాలు, యాపిల్, పౌష్టికాహారం తీసుకోవాలి.
     కంటికి ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.
     చిన్న వయసులోనే ఎక్కువగా టీవీ చూడకూడదు. మరీ దగ్గరగా కూర్చోకుండా టీవీకి 10 అడుగుల దూరంలోంచి టీవీ వీక్షించాలి.
     గదిలో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో టీవీని వీక్షించకూడదు. ఒకవేళ చీకట్లో టీవీ వీక్షిస్తే నేరుగా కంటిపై టెలివిజన్ వెలుతురు పడి దృష్టిలోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
శ్రద్ధ వహించాలి..
 కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు పాటించాలి. ఏ-విటమిన్, పౌష్టికాహార లోపం వలన దృష్టిలోపం సంభవిస్తుంది. విద్యార్థులకు స్వచ్ఛమైన ఆకుకూరలు, గుడ్లు, పాలు ఎక్కువ మోతాదులో అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో కంటి పరీక్షలు చేసుకోరు. దీనివల్ల  కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పుట్టకతో, వంశపారపర్యంగా, మెల్లకన్ను ఉన్న వారికి దృష్టిలోపం సంభవిస్తుంది.
 - లింగేష్, అప్తాల్మిక్ ఆఫీసర్, రిమ్స్

మరిన్ని వార్తలు