నేడు జెడ్పీ అత్యవసర సమావేశం

28 Jul, 2014 00:13 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా రూపొందించిన జిల్లా ప్రణాళికకు ఆమోదముద్ర వేసేందుకు జిల్లా పరిషత్ పాలకవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశం కానుంది. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక తర్వాత తొలిసారిగా జరగనున్న ఈ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ. 2,471 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిం చిన జిల్లా ప్రణాళిక  అంశాలను సభ్యులు చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

 ఈనెల 31న ఈ సమావేశాన్ని నిర్వహించాలని ముందు  గా భావించారు. ఈ మేరకు సభ్యులకు సమాచారం అందించారు. కానీ ఆ రోజు లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే సోమవారం జెడ్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జెడ్పీ చైర్మన్ శోభారాణి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలున్నాయి.

 ప్రణాళికలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
 ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించింది. గ్రామ, మండల, జిల్లా ప్రణాళికలు వేర్వేరుగా రూపొందించారు. గ్రామ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ ప్రణాళికను రూపొందించగా, రెండు, అంతకంటే ఎక్కువ గ్రామాలకు సంబంధించిన రోడ్లు, తాగునీటి పథకాలు, చెరువులు వంటి అభివృద్ధి పనులు మండల ప్రణాళికలో పొందుపరిచారు. అలాగే భారీ అభివృద్ధి పనులు రెండు, అంతకంటే ఎక్కువ మండలాల పరిధిలో ప్రభావితం చూపే ఆర్‌అండ్‌బీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాల పనులను జిల్లా ప్రణాళికలో చోటు కల్పించారు.

ఈ మేరకు రూ.2,471 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన జిల్లా ప్రణాళికకు సోమవారం ఆమోద ముద్ర పడనుంది. ఈ ప్రణాళికలకు ఆమోదం తెలిపి ఈనెల 31లోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్  జగన్మోహన్ ప్రత్యేక దృష్టి సారించారు.

 అవసరమైతే ఇతర అంశాలపై చర్చకు అనుమతి.. - శోభారాణి, జెడ్పీ చైర్‌పర్సన్
 కేవలం ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసేందుకే జెడ్పీ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని చైర్‌పర్సన్ శోభారాణి ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ మేరకు అజెండా రూపొందించామని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఏమైనా సూచనలు చేస్తే ఆ మేరకు సంబంధిత అంశాలపై చర్చకు అనుమతిస్తామని అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జెడ్పీ సీఈవో అనితాగ్రేస్ తెలిపారు. ఈ మేరకు సభ్యులందరికి సమాచారం అందించామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు