జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక.. నేడే!

8 Jun, 2019 10:20 IST|Sakshi
జెడ్పీచైర్మన్‌ ఎన్నికకు చేసిన ఏర్పాట్లు, పరిశీలిస్తున్న కలెక్టర్‌

సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్‌పై తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది. 31 జెడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా 24 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోనుంది. శనివారం నాటి ఎన్నిక లాంఛనమే కానుంది. నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండా నరేందర్‌ రెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు తెలిపాయి. మిర్యాలగూడ జెడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి కూడా చైర్మన్‌ పదవిని ఆశించారు. కానీ, ఆయనకు మరో పదవి రూపంలో గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం నచ్చజెప్పినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు జిల్లా పరిషత్‌లో ప్రధానమైన నాలుగు పదవులను నాలుగు నియోజకవర్గాలకు కేటాయించారని చెబుతున్నారు.

వైస్‌ చైర్మన్‌ పదవి నాగార్జునసాగర్‌  నియోజకవర్గానికి కేటాయించినట్లు సమాచారం. అనుముల జెడ్పీటీసీ సభ్యుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరుగి పెద్దులు పేరు ఖరారైందని తెలుస్తోంది. కోఆప్షన్‌ సభ్యుల విషయానికొస్తే మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు కో–ఆప్షన్‌ సభ్యుల పదవులు ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఆగమోత్కూరు మాజీ సర్పంచ్‌ మోసిన్‌ అలీ, నల్లగొండ నియోజకవర్గం నుంచి క్రిస్టియన్‌ సామాజిక వర్గానికి చెందిన జాన్‌ శాస్త్రి పేర్లపై చర్చ జరిగిందని అంటున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి జెడ్పీ స్టాండింగ్‌ కమిటీల్లో అవకాశం కల్పిస్తామ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఎన్నికల లాంఛనమే...!
జిల్లాలోని 31 జెడ్పీటీసీ సభ్యులకుగాను టీఆర్‌ఎస్‌ 24 మందిని, కాంగ్రెస్‌ ఏడుగురు సభ్యులను గెలచుకున్నాయి.  దీంతో అత్యధిక మెజారిటీ ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం  సభ్యులను క్యాంపులకు తరలించారు. జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నేతృత్వంలో క్యాంప్‌ ఏర్పాటైంది. వీరంతా శనివారం జరిగే జెడ్పీ చైర్మన్‌ ఎన్నికకు ఉదయం 10 గంటల కల్లా జిల్లా పరిషత్‌కు చేరుకుంటారు. ముందుగా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి  జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.

మరిన్ని వార్తలు