నేడు ‘ఇంజినీరింగ్’పై హైకోర్టు తీర్పు

22 Aug, 2014 03:03 IST|Sakshi
నేడు ‘ఇంజినీరింగ్’పై హైకోర్టు తీర్పు

- హైకోర్టు అనుమతినిచ్చేనా..?
- భరోసాలో యాజమాన్యాలు
- ‘రేట్లు’ పెంచుతామంటున్న కళాశాలలు
శాతవాహన యూనివర్సిటీ : జేఎన్టీయూ అనుమతి నిరాకరించిన వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు ఇంకా ఆశలపల్లకిలో ఊరేగుతున్నాయి. ఉన్నత విద్యామండ లి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేసి.. అనుమతులను రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆయా కళాశాల యాజమాన్యాలు హైకోర్టుకెళ్లాయి. కౌన్సెలింగ్‌కు కొద్దిరోజుల ముందే అనుమతి లేదంటూ వెబ్ ఆప్షన్స్‌లో పేర్లు తొలగించడం సరికాదని దావా వేశాయి.

దీనిపై శుక్రవారం హైకోర్టు కళాశాలల అనుమతి రద్దు విషయమై తీర్పు వెలువరించనుంది. కళాశాలలో వసతులు లేకుంటే కొన్ని కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సి ఉంటుందని, మొత్తం కళాశాలనే రద్దు చేయడం ఉండదని, పైగా మేనేజ్‌మెంట్ కోటా కింద విద్యార్థులను చేర్చుకుంటామని ప్రకటించామని, ఇప్పుడు రద్దు చేస్తే ఎలా అంటూ యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కళాశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. షరతులు విధించైనా కళాశాలలకు అనుమతి ఇస్తుందంటూ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
 
చేయిదాటిన విద్యార్థులు

జిల్లాలో ఎనిమిది కళాశాలలకు మాత్రమే అనుమతి ఉండడంతో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులందరూ ఆయా కళాశాలల్లో చేరిపోయారు. ప్రస్తుతం అనుమతి లేని కళాశాలలకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. మెరికలు తప్ప ఆ తర్వాతి స్థానంలో ఉన్న విద్యార్థులే చేరే అవకాశముంటుందని ఆయా కళాశాలల ఫ్యాకల్టీ పేర్కొంటున్నారు. మెరుగైన ర్యాంకర్లు కళాశాలలో చేరకుంటే నష్టపోయేది కళాశాలేనని, వారు బాగా చదవకుంటే కళాశాలలకు భవిష్యత్తులో చుక్కెదురు తప్పకపోవచ్చని చర్చించుకుంటున్నారు. ఈనెల 26న విద్యార్థులు ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది. ఆ లోపు అనుమతి వస్తేనే ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనుమతి వచ్చినా... పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు.
 
రేట్లు పెంచుతామంటున్న కళాశాలలు

సందెట్లో సడేమియా అన్న చందంగా జిల్లాలో అనుమతి ఉన్న కళాశాలలు మేనేజ్‌మెంట్ సీట్లను అధిక రేట్లకు అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఎదుటి కళాశాలలో ఉన్న సమస్యలను ఫోకస్ చేస్తూ.. తమ కళాశాలల్లో చేరే విద్యార్థుల నుంచి అందినకాడికీ దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మేనేజ్‌మెంట్ సీట్ల కోసం వచ్చిన వారి నుంచి సర్టిఫికెట్స్ తీసుకుంటూ.. ‘జాగ్రత్త’గా డీల్ చేస్తున్నట్లు తెల్సింది.

మరిన్ని వార్తలు