ప్రతి అంగన్‌వాడీలో మరుగుదొడ్డి!

15 Sep, 2019 02:37 IST|Sakshi

తాగునీటికి ప్రత్యేక వసతి..కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం 

కేంద్రం 60 శాతం,రాష్ట్రం 40 శాతం వాటా

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్డిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల్లో అత్యధిక లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాన్ని సందర్శించే సమయంలో వారికి అత్యవసర సమయంలో వసతి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. చాలాచోట్ల అంగన్‌వాడీలు ప్రభుత్వ పాఠశాల ఆవరణకు సమీపంలో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉండడంతో స్కూల్‌కు కేటాయించిన మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. వీటి నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో కేంద్రం మంజూరు చేస్తున్న నేపథ్యంలో స్థానిక అవసరాలు, లబ్ధిదారుల నిష్పత్తిని బట్టి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏటా 25శాతం చొప్పున కార్యాచరణ ప్రణాళికలో పొందుపర్చి నిర్మాణాలు చేపట్టనున్నారు. మొత్తంగా నాలుగేళ్లలో ప్రతి కేంద్రంలో మరుగుదొడ్డి ఉండాల్సిందే. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. 

తాగునీరూ అవసరమే 
లబ్ధిదారులకు వసతుల కల్పనలో భాగంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి వసతికి ప్రభుత్వం నిధులివ్వనుండగా.. మరుగుదొడ్ల నిర్వహణ ఇతరత్రా కార్యక్రమాలకు అవసరమయ్యే వాడుక నీటికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం స్థానిక పాలకులు చూడాల్సిందిగా సూచించింది. మరుగుదొడ్లు, తాగునీటి వసతులను ఒకే కార్యాచరణ ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తే విడుదల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా