'భారీ స్థాయిలో వైఎస్ జయంతి వేడుకలు'

7 Jul, 2015 16:16 IST|Sakshi
'భారీ స్థాయిలో వైఎస్ జయంతి వేడుకలు'

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని బుధవారం భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ పేరును ప్రజల గుండెల్లోంచి చెరిపేసే ప్రయత్నాన్ని తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారని విమర్శించారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల డిజైన్లను మార్చుతున్నారని మండిపడ్డారు.

'చంద్రబాబు పోలవరాన్ని పక్కనపెట్టి వైఎస్ పేరును ప్రజల గుండెల్లోంచి తప్పించేందుకు పట్టిసీమను నిర్మిస్తున్నారు. కేసీఆర్ కూడా తన ఇమేజ్ కోసం ఆరు జిల్లాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టును నాలుగు జిల్లాలకే పరిమితం చేస్తున్నారు. ప్రాణహిత - చేవెళ్లతో హైదరాబాద్కు తాగునీటి సమస్యను తీరనుంది. చనిపోయిన వైఎస్పై విమర్శలు చేయటం కేసీఆర్కు తగదు.. కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. బుధవారం భారీ స్థాయిలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం' అని పొంగులేటి అన్నారు.

అదే విధంగా.. ప్రజల కోసం పరితపించిన వ్యక్తుల్లో వైఎస్ ప్రథమ స్థానంలో ఉంటారని అన్నారు. రైతులను రాజులను చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉండగా దేశంలోనే వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిందంటే ఆయనకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు