రేపు సిరిసిల్లకు గులాబీ దళపతి

19 Nov, 2018 16:05 IST|Sakshi

ఖరారైన సీఎం కేసీఆర్‌ సభ

ఇరవై ఎకరాల్లో వేదికకు ఏర్పాట్లు

బైపాస్‌ రోడ్డులో భారీబహిరంగ సభ

సభాస్థలిని పరిశీలించిన ఎంపీ వినోద్‌కుమార్‌

50 వేల మందికి సరిపడా ఏర్పాట్లు

సిరిసిల్ల, వేములవాడ నియోజవర్గాలస్థాయి సభ

సిరిసిల్లటౌన్ ‌: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ మంగళవారం జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు శివారు ప్రైవేటు స్థలంలో భారీబహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేస్తుండగా పనులను ఆదివారం కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పరిశీలించారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటుగా ఆయన సభాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. భారీబహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వరుసగా రెండురోజులపాటు ఆయన సిరిసిల్లకు వచ్చి  సభాస్థలిని పర్యవేక్షిస్తూ..ఏర్పాట్లపై పార్టీ నేతలకు సూచనలు చేశారు.

50 వేల మందికి సరిపడా..
బైపాస్‌ రోడ్డులో సుమారు 20ఎకరాల ప్రైవేటు స్థలాన్ని చదును చేసి భారీస్థాయిలో వేదికను రూపొందిస్తున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలస్థాయి భారీ బహిరంగ సభ కావడం విశిష్టత చేకూరింది. ఇరు నియోజకవర్గాల ప్రజలకు అనుకూలం కావడంతో సిరిసిల్ల బైపాస్‌రోడ్డును కేసీఆర్‌ సభకు ఎంపిక చేశారు. సభాస్థలకి సమీపంలోనే హెలిప్యాడ్‌ నిర్మిస్తున్నారు. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సీఎం సభ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరగుతున్నాయి. సుమారు 50 వేల మంది వరకు సభకు హాజరు అవుతారని అంచనా వేసి ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్‌ వచ్చి ఇరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించి వెళ్లనున్నారు.  

ఉరకలెత్తిన ఉత్సాహం..
సీఎం కేసీఆర్‌ సిరిసిల్లకు రానుండటంతో గులాబీ పార్టీలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మూడ్రోజులుగా సిరిసిల్ల నాయకత్వం సభ ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో సైతం కేసీఆర్‌ సభ తర్వాత పార్టీ ప్రచారం తారాస్థాయికి చేరి 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేశ్‌బాబు గెలుపొందారు. కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడలకు కేసీఆర్‌ ఇవ్వబోయే వరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

మరిన్ని వార్తలు