రేపు ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్

15 Feb, 2016 00:27 IST|Sakshi
రేపు ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్

21 రౌండ్లకు
14 టేబుళ్ల ఏర్పాటు
ఈవీఎంలకు పటిష్ట భద్రత

 
నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నిక ముగియడంతో అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న జరిగిన పోలింగ్ అనంతరం ఈవీఎంలను నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలోని గదిలో భద్రపరిచారు. 16వ తేదీన అధికారులు పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల పైగదిలో కౌంటింగ్ ప్రక్రియను ఉదయం 8గంటలకు ప్రారంభిస్తారు. 14 టేబుళ్ల ద్వారా 21 రౌండ్లు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ప్రతి రౌండ్‌కు 14 ఈవీఎంలను అధికారులు లెక్కిస్తారు. ఇలా 21 రౌండ్లలో 286 ఈవీఎంలను అధికారులు లెక్కిస్తారు. ప్రతి రౌండ్‌ను 10నిమిషాల్లో పూర్తిచేస్తారు. మధ్యాహ్నం 12గంటలకల్లా ఫలితం వెలువడనుంది.


ఈవీఎంల గదికి పటిష్ట భద్రత
ఈవీఎంలు భద్రపర్చిన గదికి అధికారులు పటిష్ట భద్రత కల్పించారు. పాలిటెక్నిక్ పై గదిలో ఈవీఎంలను భద్రపర్చిన అధికారులు సీలు వేశారు. నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్‌ఓ పర్యవేక్షిస్తున్నారు. అటువైపు ఎవరినీ అనుమతించడంలేదు.కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు  స్కృటినీ పూర్తిచేశారు. ఓటరు హాజరును రిజిస్టరు ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో అబ్జర్వర్ పూర్తిచేశారు. పోలైన ఓట్ల డైరీని పూర్తిచేసి సీలు వేశారు.

ప్రతీ టేబుల్‌పై మైక్రోఅబ్జర్వర్
కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తారు. ఇలా 14మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తారు. వీరితోపాటు ప్రతి టేబుల్‌కు ఆయా పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు.

 నేర చరిత్ర లేనివారే ఏజెంట్లు
ఎలాంటి నేరచరిత్ర లేని కౌంటింగ్  సిబ్బందిని నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన 14టేబుళ్లకు టేబుల్‌కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. అభ్యర్థులు ఇచ్చిన ఏజెంట్ల పేర్లపై అధికారులు విచారణ చేపట్టి ఏజెంట్లుగా నియమించనున్నారు. ఏజెంట్లుగా నియమితులైన వారు అరగంట ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది.
 

>
మరిన్ని వార్తలు