ఆందోళనకు దిగిన ఓటర్లు

12 Apr, 2014 00:04 IST|Sakshi

వెల్దుర్తి, న్యూస్‌లైన్:  అధికారుల నిర్లక్ష్యంతో బ్యాలెట్ పేపర్లు తప్పల తడకగా మారాయి. విషయాన్ని గమనించిన ఓటర్లు ఆందోళనకు దిగడంతో కాసేపు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎంపీటీసీ పో లింగ్‌ను వాయిదా వేసి జెడ్పీటీసీ పోలిం గ్‌ను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌స్టేషన్ నం.6లో వెల్దుర్తి-2 ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఎంపీటీసీ బ్యాలెట్ రెండో బండిల్‌లోని సీరియల్ నం. 2051 నుండి 2100 వరకు ఉన్న 50 బ్యాలెట్ పేపర్లుండగా 2051 నుండి 2065 వరకు వెల్దుర్తి ఎంపీటీసీ-2 నమూన బ్యాలెట్ సరిగానే అచ్చు అయ్యాయి.  అయితే 2066 నుండి 2100 వరకు ఉన్న బ్యాలెట్ పేపర్లలో వెల్దుర్తి ఎంపీటీసీ-1 నమూన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 44 బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు, పేర్లు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిని ఓటర్లు గమనిం చి అందోళన చేపట్టారు.

 అప్పటికే ఈ బెండిల్‌లో 29 ఓట్లు పోలయ్యాయి. విష యం తెలిసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుభాషిణి పోలింగ్ కేంద్రానికి చేరుకొని బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుండి 9.30 గంటల వరకు పోలింగ్ నిలిపివేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద పడిగాపులుకాశారు. ఎన్నికల అధికారులకు, కలెక్టర్‌కు అధికారిణి సుభాషిణి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 9.30 గంటలకు కేవలం జెడ్పీటీసీ ఎన్నికలను మత్రమే ప్రారంభించి ఎంపీటీసీ పోలింగ్‌ను నిలిపివేశారు. త్వరలో రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

 సిబ్బంది నిర్లక్ష ్యంతోనే రీపోలింగ్: జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం
 స్థానిక ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓల నిర్లక్ష్యమే రీపోలింగ్‌కు దారి తీసిందని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం పేర్కొన్నారు. పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలుసుకున్న జడ్పీ సీఈఓ ఆశీర్వాదం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు