రేపు ఆర్టీసీ బస్సులూ ఉండవు!

18 Aug, 2014 01:51 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నందున ఆ రోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వే రోజున సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, బ్యాంకులు కూడా సెలవు ప్రకటించేశాయి. హోటళ్లు, సినిమా థియేటర్లు సైతం తెరుచుకోవు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోవటంతో బస్సులు నడపకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులనే వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువేల బస్సులు ఉపయోగించే అవకాశం ఉంది. మిగిలిన 4 వేల బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తే పరిమితంగా బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.
 
 అద్దె చెల్లిస్తేనే ఏర్పాట్లు...
 
 తెలంగాణవ్యాప్తంగా బస్సులు తిరగని పక్షంలో ఆర్టీసీ రోజుకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది. డీజిల్ రూపంలో దాదాపు రూ.5 కోట్లు, మెయింటెనెన్స్ ద్వారా రూ.2 కోట్ల మేర పొదుపు నమోదైనా రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో సర్వే కోసం ఆర్టీసీ బస్సులను విగినియోగిస్తే అందుకు అద్దె చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు సంస్థ తేల్చి చెప్పింది. ఒక్కో బస్సుకు రూ.11,200 చొప్పున అద్దె చెల్లించాలని పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 1,100 బస్సుల కోసం కలెక్టర్ల నుంచి విజ్ఞాపనలు అందాయి. సోమవారం మధ్యాహ్నానికి ఐదు నుంచి ఆరు వేల బస్సులు బుక్కయ్యే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం పాఠశాలల బస్సులను బుక్ చేసుకుంటున్నాయి. కాగా, 19న బస్సులు తిప్పకూడదని ఆర్టీసీ నిర్ణయించినా.. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు రావాల్సి ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉన్నందున వారు ఇళ్ల వద్ద లేకున్నా సర్వేకు ఇబ్బంది ఉండదని, సర్వే సిబ్బంది దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. మరీ అంత అవసరమైతే అత్యవసర విధుల్లో ఉన్నట్టుగా కలెక్టర్ల నుంచి పత్రాలు తెప్పించి జారీ చేస్తామని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు