డబ్బుల కోసమే హత్య

3 Feb, 2018 16:01 IST|Sakshi
నిందితుడి అరెస్టు చూపుతున్న డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

నేరం అంగీకరించిన నిందితుడు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు

తూప్రాన్‌ : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత నెల 28న ఓ గుర్తుతెలియని మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌పోన్‌ ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్‌ డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం సోలక్‌పల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(45) గత నెల 28న శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురవగా మృతదేహం లభించిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గురైన మహిళ వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు.

హత్యకు గురైన చంద్రకళ ఆటోడ్రైవర్లు, తెలిసిన వ్యక్తుల వద్ద విచ్చలవిడిగా తిరిగే మహిళ అని అన్నారు. ఇదే క్రమంలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవితో పరిచయం ఉన్న చంద్రకళకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రూప్‌సింగ్‌(70) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను మచ్చిక చేసుకొని గతంలో పలుమార్లు చంద్రకళతో సహవాసం చేసినట్లు తెలిపారు. గత నెల 27న చంద్రకళకు ఫోన్‌ చేసి నర్సాపూర్‌కు రప్పించారు. అక్కడి నుంచి రవి ఆటోలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చంద్రకళను తీసుకువచ్చారు. అనంతరం రవి ఆటోలో వెళ్లిపోగా నిందితుడు రూప్‌సింగ్‌ చంద్రకళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది చంద్రకళను హత్య చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసి మృతురాలి వద్ద డబ్బులు, నగల కోసం వెతికగా ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి రూప్‌సింగ్‌ వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సెల్‌ఫోన్‌ ఆధారంగా హంతకుడు రూప్‌సింగ్‌ను గుర్తించినట్లు తెలిపారు.

నిందితుడు పాత నేరస్తుడే
చంద్రకళను హత్య చేసిన నిందితుడు పాత నేరస్తుడని డీఎస్పీ చెప్పారు. 1998 సంవత్సరంలో వర్గల్‌ మండలం నాచారంలో ఓ మహిళ హత్య కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే తన సొంత అత్తను 2010లో హత్య చేసిన కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ లింగేశ్వర్‌రావు, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, స్థానిక ఎస్సై శేఖర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డి, సిబ్బంది మంగ్యానాయక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు