కందిపప్పు రాలే..!

1 Jun, 2020 13:38 IST|Sakshi

ఇంత వరకు జిల్లాకు చేరుకోని స్టాక్‌

లబ్ధిదారులకు పంపిణీపై స్పష్టత కరువు

యథావిధిగా బియ్యం పంపిణీ

నిజామాబాద్‌, ఇందూరు/మోర్తాడ్‌: కరోనా ప్యాకేజీలో భాగంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్న కందిపప్పు జూన్‌ నెలలో అందే పరిస్థితి కనిపించడం లేదు. రెండు, మూడు రోజుల్లో రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానుండగా, స్టాక్‌ మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. దీంతో కందిపప్పు పంపిణీపై స్పష్టత కరువైంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు ఆకలితో ఉండకూడదని ఏప్రిల్, మే నెలలో రేషన్‌ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం కోటా కింద తెల్ల రేషన్‌ కార్డుకు కిలో చొప్పున కందిపప్పును మూడు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. 

వాస్తవానికి ఏప్రిల్‌లో కూడా కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా, స్టాక్‌ రావడంలో ఆలస్యం అయ్యింది. దీంతో మే నెలలో ఏప్రిల్‌ కోటాను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో 3,90,687 రేషన్‌ కార్డులుండగా, 12,92,682 మంది లబ్ధిదారులున్నారు. మే నెలలో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 390 మెట్రిక్‌ టన్నులు లబ్దిదారులకు అందజేశారు. ప్రస్తుతం జూన్‌ నెలలో మే, జూన్‌లకు సంబంధించి లబ్ధిదారులకు రెండు కిలోల చొప్పున కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ స్టాక్‌ రాలేదు. జిల్లా సివిల్‌ సప్లై అధికారులు రాష్ట్ర అధికారులను సంప్రదించినా వారు కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో కందిపప్పు పంపిణీ విషయం ప్రశ్నార్థకంగా మారింది. కందిపప్పుపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదని సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డీఎం అభిషేక్‌సింగ్‌ ‘సాక్షి’కి తెలిపారు. అయితే, బియ్యం మాత్రం ఇప్పటికే జిల్లాలో దాదాపు సగం రేషన్‌ దుకాణాలకు చేరుకుంది. గత రెండు నెలలు ఇచ్చినట్లుగానే ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు డీఎస్‌వో వెంకటేశ్వరరావు తెలిపారు.

రూ.1,500 సాయం నిలిపివేత..
కరోనా సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రేషన్‌ కార్డుకు రూ.1,500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల కుటుంబాలరు రూ.58.50 లక్షల వరకు సాయం అందింది. అయితే, జూన్‌ నెల నుంచి ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది.

మరిన్ని వార్తలు