టాప్ 3 లక్ష్యం

14 Feb, 2015 03:12 IST|Sakshi

 ప్రైవేటు టీచర్లతో పోలిస్తే మీరెందులో తక్కువ? వాళ్ల కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. మీకే ఎక్కువ
 అర్హతలున్నాయి. ఎప్పటికప్పుడు పదోన్నతులు  పొందుతున్నారు. ఇంక్రిమెంట్లు అందుతున్నాయి.
 పాఠశాలలకు వచ్చే పిల్లలకు మధ్యాహ్నభోజనం  సహా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అయినా ఎందుకు ఫలితాలు సాధించలేకపోతున్నారు?
 
 ప్రభుత్వ పాఠశాల ల్లో పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదనే భావనను తొలగించాలి. ఎంతమందిని
 పాస్ చేయించామనే భావనకంటే ఎంతమందికి గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని ఆలోచించాలి. ఈ విషయంలో టీచర్లు దృష్టి పెడితే మంచి ఫలితాలొస్తాయి. టెన్త్ ఫలితాల్లో జిల్లాను టాప్ 3లో నిలిపేందుకు కృషి చేయూలి.
 ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ నీతూకుమారిప్రసాద్
 
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులను ఇకపై జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ చెప్పా రు. అలాగే సరిగా పనిచేయని వారిపైనిబంధనల మేరకు త గిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు’ అనే అంశంపై శుక్రవారం రెవెన్యూ గా ర్డెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
 
 ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ఫలితాల్లో వెనుకబడటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 10/10 జీపీఏ పాయింట్లు సాధించిన పాఠశాలలు 198 ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 16కే పరిమితం కావడం బాధాకరమన్నారు. ‘ప్రైవేటు వాళ్లు మీకంటే ఎందులో ఎక్కువ? జీతాల్లోనా? అర్హతల్లోనా? వాళ్లకంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు? మీకే ఎక్కువ అర్హతలున్నాయి? ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లుసహా అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. అయినా ఎందుకు ఫలితాలు రావడం లేదు?’ అంటూ ప్రశ్నించారు.
 
 ప్రైవేటు పాఠశాలల్లో తగిన ఫలితాలు సాధించలేని అధ్యాపకులను యాజమాన్యం తీసివేస్తోందని, ప్రభుత్వం మాత్రం సరిగా పనిచేయకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానంలోనూ ‘పనిష్‌మెంట్-ఇంక్రిమెంట్’ విధానం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘బాగా పనిచేసిన వారికి మేం ఇకపై గుర్తింపు ఇస్తాం. మంచి ఫలితాలు సాధించిన వారిని గుర్తించి జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానిస్తాం. అట్లాగే పనితీరు బాగాలేని వారిపై నిబంధనలకు లోబడి తగిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, వంటశాలల నిర్మాణం సహా పాఠశాలల్లోని సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
 
 ఆమె ఇంకా ఏమన్నారంటే...
 ప్రభుత్వ పాఠశాలలకు పేద పిల్లలే ఎక్కువగా వస్తుంటారు. వారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళుతుండటం వల్ల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేరు. కాబట్టి ఉపాధ్యాయులే ఈ బాధ్యత తీసుకోవాలి.
 
 జిల్లాలో గత ఐదేళ్లలో జనాభా బాగా పెరిగింది. కానీ 2010తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య మాత్రం 7వేల వరకు తగ్గింది. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడమే అందుకు కారణం.టీచర్లు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తే విద్యార్థులు కూడా వస్తారు. వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. పునాది గట్టిగా ఉంటే ఫలితాలు బాగా వస్తాయి. ఇకపై 6వ తరగతి నుంచే విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
 
 కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాల్లో ఫలితాలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఆశాజనకంగా లేవు. వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.గిరిజన పాఠశాలల్లో ఫలితాలు సంతృప్తిగా లేవు. మెరుగైన ఉత్తీర్ణ సాధించేలా పర్యవేక్షణ చేయూలని గిరిజన సంక్షేమ అధికారి ఎర్రన్నను ఆదేశించారు.
 
 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదని, అట్లాంటప్పుడు వంద శాతం ఫలితాలెలా సాధ్యమని ఆ శాఖ ఉప సంచాలకుడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. రాత్రిపూట వార్డెన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 అదనపు జారుుంట్ కలెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ ఒకటో నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులంతా దాదాపు రెండువేల రోజులపాటు అధ్యాపకుల వెన్నంటే ఉంటున్నప్పటికీ కనీసం వారిని పాస్ చేయించలేకపోవడం బాధాకరమన్నారు.
 
 డీఈఓ కె.లింగయ్య మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్త మ ఫలితాలు సాధించేందుకు యత్నిస్తున్నామన్నారు. అందులో భాగంగా డివిజన్, మండలం, పాఠశాలల వా రీగా సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు