‘నీట్‌’ అమ్మాయిల్లో టాపర్‌ మాధురీ

6 Jun, 2019 01:28 IST|Sakshi
టాప్‌ ర్యాంకర్‌

695 మార్కులు సాధించిన తెలంగాణ విద్యార్థిని.. నీట్‌ ఫలితాలు విడుదల

గతం కంటే పెరిగిన కటాఫ్‌ మార్క్‌... గతేడాది 107... ఇప్పుడు 134 

మొదటి ‘కీ’కి, తుది ‘కీ’కి  భారీ తేడా... దీంతో ఉత్తరాదికి లాభం

గతేడాది టాప్‌ 50 ర్యాంకుల్లో ఎక్కువ దక్షిణాదివారే... ఇప్పుడు ఉత్తరాదివారు

 అమ్మాయిలే టాప్‌... 
7,97,042 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికం అమ్మాయిలే. ఈసారి జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కు 134.


టాప్‌ 50లో నాలుగు... 
తెలుగు విద్యార్థుల్లో మాధురీరెడ్డి తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40వ ర్యాంకు, సోడం 
శ్రీనందన్‌రెడ్డి.. 42 ర్యాంకు సాధించారు. 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో తెలంగాణ బిడ్డ మాధురీరెడ్డి దేశవ్యాప్తంగా ఏడో ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయి టాపర్‌గా రాజస్తాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ 720 మార్కులకుగాను... 701 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, 695 మార్కులు సాధించి తెలంగాణ విద్యార్థిని జి.మాధురీరెడ్డి ఏడో ర్యాంకులో మెరిసింది. టాప్‌ 50 ర్యాంకులు సాధించిన విద్యార్థుల మధ్య మార్కుల తేడా 16 మాత్రమే ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42వ ర్యాంకు 
సాధించారు. గతేడాది కంటే పేపర్‌ సులువుగా రావడంతో కటాఫ్‌ మార్కు కూడా పెరిగింది. గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కు 107 కాగా, ఈసారి 134కు పెరిగింది.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 5న దేశవ్యాప్తంగా 154 నగరాల్లో 2,546 కేంద్రాల్లో నీట్‌ పరీక్ష నిర్వహించారు. 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒడిశాలో ఫొని తుపాను, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థుల కోసం గత నెల 20న మరోసారి పరీక్ష నిర్వహించారు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలు నెలకొన్నప్పటికీ... ముందుగా పేర్కొన్నట్లుగానే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7,97,042 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం ఉత్తీర్ణతా శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు. 4,45,761 మంది అమ్మాయిలు, 3,51,278 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. ఇక ఏపీలో 70.72 శాతంతో 39,039 మంది, తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తెలుగు భాషలో రాయడానికి 1796 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మే 29న నీట్‌ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్‌టీఏ విడుదల చేసింది. జూన్‌ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ఫలితాలను వెల్లడించింది. 

15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్‌... 
నీట్‌ పరీక్షలో జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. నీట్‌–2019 ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్‌ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తారు.

నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను ‘మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌’ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌తో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందిస్తాయి. నీట్‌ మెడికల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగానే ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్‌ఐసీ.ఇన్‌’వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్‌టీఏ సూచించింది. ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు.  

తుది ‘కీ’తో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం! 
మే 29న నీట్‌ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్‌టీఏ విడుదల చేసింది. జూన్‌ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణకు చెందిన విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు శ్రీచైతన్య కూకట్‌పల్లి జూనియర్‌ కాలేజీ డీన్‌ శంకర్‌రావు చెప్పారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని ఆయన అన్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయన్నారు.

అలా రెండు ప్రశ్నలకు కలిపి 8 మార్కులు, వాటికి మైనస్‌ మార్కులతో కలిపి 10 మార్కులు కోల్పోయినట్లు ఆయన విశ్లేషించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందన్నారు. ఉత్తరాది వారు రాసిన దానికి అనుగుణంగా ఇలా జరిగిందన్న భావన విద్యార్థుల్లో నెలకొందన్నారు. దీంతో గతేడాది జాతీయస్థాయి 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందినవారు నలుగురుంటే, ఈసారి ఒకరే ఉన్నారన్నారు. అలాగే వందలోపు ర్యాంకులు వచ్చినవారు గతేడాది 16 మంది ఉంటే, ఈసారి పదిలోపే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. అలాగే గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు.  
–––––––––––––––––––––––– 
దేశవ్యాప్తంగా ‘నీట్‌’పరీక్షలో అర్హులైనవారు.. 
–––––––––––––––––––––––– 
కేటగిరీ        పర్సంటైల్‌    కటాఫ్‌ మార్కు    అర్హులు 
–––––––––––––––––––––––– 
జనరల్‌        50        701–134        7,04,335 
ఓబీసీ          40        133–107        63,789 
ఎస్సీ           40        133–107        20,009 
ఎస్టీ            40        133–107        8,455 
––––––––––––––––––––––––– 
కార్డియాలజిస్టును అవుతా 
 – మాధురీరెడ్డి 
నీట్‌–2019 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు, అమ్మాయిల్లో తొలి ర్యాంకు సాధించిన గంగదాసరి మాధురీరెడ్డి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని చెప్పారు. కార్డియాలజిస్ట్‌ కావాలన్నదే తన లక్ష్యమన్నారు. మాదాపూర్‌ నారాయణ కాలేజీలో చదివానని, ప్రతీ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల దాకా నీట్‌ పరీక్ష కోసం చదివానన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. తన విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. డీన్‌ సాయి లక్ష్మి, టీచర్ల ప్రోత్సాహం మరవలేనిదని చెప్పారు.  

మరిన్ని వార్తలు