ఇక టోరా క్యాబ్స్‌

27 Aug, 2019 10:39 IST|Sakshi

ప్రయాణికులకు అందుబాటులోకి సరికొత్త క్యాబ్‌ సేవలు

10,500 మంది డ్రైవర్‌ భాగస్వాములతో సర్వీసులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ రహదారులపై మరో సరికొత్త క్యాబ్‌ సర్వీస్‌ ‘టోరా’ అందుబాటులోకి వచ్చింది. సోమవారం ఈ క్యాబ్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉబర్, ఓలా తరహాలోనే టోరా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ క్యాబ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయాణికులపై ఎలాంటి  సర్‌చార్జీల భారం ఉండబోదని, అలాగే  డ్రైవర్‌ భాగస్వాములు కూడా కమిషన్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని టోరా టెక్నాలజీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీటీఎస్‌పీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ శాంతి మండే అన్నారు. డ్రైవర్లు కేవలంయూజర్‌ చార్జీలు చెల్లిస్తే  చాలునని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు టోరా సర్వీసులు అందుబాటులో ఉండేవిధంగా 10,500 మంది డ్రైవర్‌ భాగస్వాములతో సేవలను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ‘ప్రయాణికులకు, డ్రైవర్‌లకు  ప్రయోజనం కలిగించేవిధంగా టోరా సేవలు ఉంటాయి. యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలను అందించడంలో టోరా ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కొరియన్‌ భాగస్వామ్య సంస్థతో కలిసి నగరంలో టోరా సేవలను ప్రారంభించారు. ప్రజారవాణా రంగంలో టోరా ఒక బాధ్యతాయుతమైన సంస్థగా సేవలనందజేస్తుందని ఆమె తెలిపారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవితా భాస్కరన్‌ మాట్లాడుతూ, ప్రయాణికులకు పూర్తి భద్రత, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందజేయడమే లక్ష్యంగా అనేక ప్రత్యేకతలతో టోరాను అందుబాటులోకి తెచ్చినట్లు  చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇవీ ప్రత్యేకతలు..
రద్దీ వేళల్లో  ప్రయాణికులపై విధించే సర్‌చార్జీలు ఉండవు.
24/7 టోరా క్యాబ్‌ అందుబాటులో ఉంటుంది.  
అతి తక్కువ వెయిటింగ్‌ సమయంలో టోరా సేవలు ఉంటాయి.
సమగ్రమైన భద్రతా వ్యవస్థతో టోరా అనుసంధానమై ఉంటుంది. పోలీసుల హాక్‌ ఐ ద్వారా  ప్రయాణికులకు భద్రత లభిస్తుంది.  
టోరాలో చేరే డ్రైవర్లు కమిషన్‌లు చెల్లించవలసిన అవసరం లేదు.రోజు వారి యూజర్‌ చార్జీ చెల్లిస్తే చాలు.
రోజుకు రూ.199 చొప్పున డ్రైవర్లు యూజర్‌ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. వారానికి  6 రోజులు, నెలకు 25 రోజులు యూజర్‌ చార్జీలు చెల్లించవలసిఉంటుంది.

మరిన్ని వార్తలు