ఫిట్‌నెస్‌ ప్రియుల నయా ట్రెండ్‌..

2 Dec, 2019 08:07 IST|Sakshi
నర్వీర్‌ జాదవ్, (ఇన్‌సెట్లో) ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ముందు..

ట్రాన్స్‌ఫార్మేషన్‌తో బాడీకి కొత్త రూపం

నెలల గ్యాప్‌లోనే మార్పులు సాధ్యం

నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు అధికబరువు ఉండేవాళ్లు బరువు తగ్గితే చాలు అనుకునేవారు. తర్వాత స్కిన్‌ టోనింగ్‌ కావాలని, శరీరం మంచి షేప్‌ కావాలని.. అలా అలా వారి ఆకాంక్షలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కోరుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ ప్రియులను ట్రాన్స్‌ఫార్మేషన్‌ ట్రెండ్‌ పట్టి కుదిపేస్తోంది. ఆద్యంతం తమ రూపాన్ని మార్చేసుకునేలా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తి ఇంతింతై విస్తరిస్తోంది. ఈ ఆసక్తి, అభిరుచి వల్ల కొన్ని నెలల గ్యాప్‌లోనే ఓ వ్యక్తి పూర్తిగా కొత్త రూపంలో దర్శనమిస్తుండడం పరిచయస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిటీలో ఇటీవలే ప్రారంభమైన ట్రాన్స్‌ఫార్మేషన్‌ ట్రెండ్‌  మరింత మందిని రూపాంతరం చెందించే దిశగా దూసుకుపోతోంది.  

బీపీ పేషెంట్‌ టూ సూపర్‌ ఫిట్‌ 
‘పని ఒత్తిడి, అధిక బరువు వంటి వాటి వల్ల నాకు 28 ఏళ్ల వయసులోనే బి.పి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి రోజూ 40 ఎం.జి వరకూ బీపీ టాబ్లెట్‌ వేసుకునేవాడ్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు కొంపల్లి నివాసి నర్వీర్‌ జాదవ్‌. జహీరాబాద్‌ నివాసి అయిన నర్వీర్‌...తనకు బీపీ సమస్య ప్రారంభమైన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు 28 ఏళ్ల కుర్రాడిలా మారారు. ‘అధికబరువుతో పాటు నన్ను వదలకుండా వెంటాడిన రక్త పోటు సమస్య పూర్తిగా దూరమైంది. ఇప్పుడు కనీసం రోజుకు 10 కి.మీ అవలీలగా పరిగెత్తగలను...’అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. యుక్తవయసులో పేషెంట్‌గా మారిన ఆయనను మధ్య వయసులో ఆరోగ్యవంతుడిగా మార్చిన మార్గం ట్రాన్స్‌ఫార్మేషన్‌.

ఆరు నూరైనా ఆరోగ్యం సాధించాలనుకున్నా...అంటూన్న నర్వీర్‌ తన ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ‘చిన్న వయసులో బీపీ రావడం వల్ల బరువు తగ్గాల్సిందేనని వైద్యులు గట్టిగా చెప్పారు. వెంటనే న్యూట్రిషనిస్ట్‌ డా.అశ్వినిని కలిసి, డైట్‌ చార్ట్‌ తీసుకున్నా. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత నెమ్మదిగా కొత్త డైట్‌కి అలవాటు పడ్డా. రెండు నెలల్లోనే 8కిలోలు తగ్గా. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ వెంకట్‌ని కలిశా. వెయిట్‌ తగ్గాలని, కాస్త బాడీ షేప్‌ రావాలని అనుకుంటున్నట్టు చెప్పా. అప్పుడే ఆయన ఫుల్‌ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ గురించి చెప్పారు. తొలుత కొంచెం సంశయించినా...ఆయన ఇచ్చిన ధైర్యంతో సరే అన్నా. అక్కడి నుంచి ఏడాదిలో 86 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గిపోయాను. దశలవారీగా వర్కవుట్స్‌ ఇంటెన్సిటీ పెంచుకుంటూ కఠినమైన వర్కవుట్స్, ఫుడ్‌ చార్ట్‌తో ఫిజిక్‌ని మార్చుకున్నాను. అదే ఊపులో మూడు నెలల కాలం టార్గెట్‌గాపెట్టుకుని సిక్స్‌ప్యాక్‌ కూడా సాధించాను. రోజుకి 20 వైట్‌ ఎగ్స్, స్టీమ్డ్‌ ఫిష్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, 2.30గంటల వ్యాయామం, యోగా...ఇవన్నీ నా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగం అయ్యాయి’’ అంటూ వివరించారు నర్వీర్‌.

ఆద్యంతం.. అపు‘రూపం’..
శరీరం మొత్తాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు లోపాలన్నీ తొలగించుకోవడం ద్వారా పూర్తి కొత్త రూపాన్ని సంతరించుకోవడమే ‘ట్రాన్స్‌ఫార్మేషన్‌’గా ఫిట్‌నెస్‌ పరిశ్రమ నిర్వచిస్తోంది. దీని కోసం ఏడాది ఆ పైన వ్యవధి నిర్ణయిస్తోంది. ‘వర్కవుట్‌ ప్రారంభించేటప్పుడు ఒక రకమైన లక్ష్యంతో ఉండి, ఆ తర్వాత అది వదిలేసి ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి..ఇలా మార్పు చేర్పులు చేయడం సర్వసాధారణం. అలాంటివేమీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక ఫిట్‌నెస్‌ అజెండా రూపొందించుకుని అమలు చేసి రిజల్ట్స్‌ సాధించేలా చేస్తుంది ట్రాన్స్‌ఫార్మేషన్‌’ అని చెప్పారు టార్క్‌ ఫిట్‌నెస్‌ స్టూడియోకు చెందిన ట్రైనర్‌ ఎమ్‌.వెంకట్‌. 

ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా నిర్ణీత వ్యవధి నిర్ణయించుకుని దాని ప్రకారం ఓ వైపు బరువు తగ్గడం, మరోవైపు శరీరాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా దీని కోసం సంపూర్ణమైన డైట్, వర్కవుట్, అన్నీ ముందే నిర్ణయించుకుని రంగంలోకి దిగుతారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేవరకూ అందులో మరీ అవసరమైతే తప్ప మార్పు చేర్పులు చేయరు. ఈ తరహా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ఎంచుకుని విజయాలు సాధిస్తున్నవారు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

అన్ని రకాలుగా...కొత్తగా 
హోల్‌ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ వల్ల కేవలం రూపంలో మాత్రమే కాదు ఆలోచనా ధోరణిలో కూడా బాగా మార్పు వస్తుంది. ఇది షార్ట్‌ టర్మ్‌ కాదు కాబట్టి వ్యక్తి జీవనశైలి కూడా మారిపోతుంది. ఒక 15ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ వయసు తగ్గినట్టు కనిపిస్తాం. తద్వారా యుక్తవయసులో మాత్రమే కనిపించే అద్భుతమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
–ఎమ్‌.వెంకట్, టార్క్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో

మరిన్ని వార్తలు