ఆకర్ష..ఆకర్ష!

26 Dec, 2017 01:20 IST|Sakshi

ఈ ఏడాది ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట

బంగారు తెలంగాణ లక్ష్యంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో వినూత్న పంథా అనుసరించింది. గత మూడేళ్లకు భిన్నంగా ఓట్ల బాటను ఎంచుకుంది. వచ్చే ఎన్నికల దిశగా ఇంటింటా ఓటర్లను ఆకట్టుకునేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కులాలు, మతాలు, వర్గాలను లక్ష్యంగా ఎంచుకొని అనేక కార్యక్రమాలు, పథకాలు ప్రకటించింది. తొలి మూడేళ్లలో ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది సైతం అంతకు మించిన ప్రాధాన్యమే ఇచ్చింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం మాత్రం ఇంకా పునాదుల్లోనే ఉంది. మిషన్‌ భగీరథ అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో ప్రభుత్వం, పరిపాలన దిశగా కొన్ని ముఖ్యాంశాలేంటో ఓసారి చూద్దాం.. 

తొలిసారి ఎంబీసీ కార్పొరేషన్‌
బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల పేరుతో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. బడ్జెట్‌లో ఎంబీసీలకు ఏకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. అయితే ఇప్పటికీ ఎంబీసీలెవరనే స్పష్టత లేకపోవటంతో అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరోవైపు రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వీటిని సైతం ఇప్పటికీ ఖర్చు చేయలేదు. మరోవైపు బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులు, సబ్‌ ప్లాన్‌ తదితర అంశాల అధ్యయనానికి ప్రజాప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపునకు బిల్లు 
రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఏప్రిల్‌ 16న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముస్లింలకు (బీసీ–ఈ కేటగిరీ) ప్రస్తుతమున్న 4 శాతం రిజర్వేషన్‌ను 12 శాతానికి, ఎస్టీలకు ప్రస్తుతమున్న 6 శాతాన్ని 10 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీంతో ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను 62 శాతానికి పెరుగుతాయి. అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లును ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఇప్పటికీ ఈ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు 
సిరిసిల్ల చేనేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు చేనేత లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాల బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతను నియమించింది. చేనేతకు ఆర్థిక సాయం కోసం నేతన్నకు చేయూత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పొదుపు నిధితోపాటు 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు, ప్రభుత్వం తరఫున మ్యాచింగ్‌ గ్రాంట్‌ను అందిస్తోంది. 

చిన్న ఉద్యోగులపై వరాల జల్లు 
అనాథ పిల్లలు, విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, హోంగార్డులు.. ఇలా క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులపై ప్రభుత్వం వరుసగా వరాల జల్లు కురిపించింది. వీఆర్‌ఏల జీతాన్ని రూ.6,500 నుంచి రూ.10,500కు పెంచారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల జీతాలను పెంచారు. అంగన్‌వాడీ కార్యకర్తల పేరును టీచర్‌గా మార్చడంతో పాటు రూ.7 వేలు ఉన్న జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల వేతనాన్ని రూ.6 వేలకు పెంచారు. హోంగార్డుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.

అనాథలు, ఒంటరి మహిళలకు భృతి 
ఒంటరి మహిళలకు నెలకు రూ.వెయ్యి చొప్పున జీవనభృతి అందించే పథకాన్ని ప్రభుత్వం మే నెల నుంచి ప్రారంభించింది. అనాథ పిల్లలకు ఎస్సీ హోదాతో పాటు ఎస్సీ రిజర్వేషన్‌ ఇస్తామని సీఎం ప్రకటించారు.

కేసీఆర్‌ కిట్‌
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు సర్కారు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయంతో పాటు నవజాత శిశువుల సంరక్షణకు అవసరమయ్యే దుస్తులు, బేబీ సోప్స్, పౌడర్లతో ఈ కిట్‌ను అందజేస్తున్నారు. జూన్‌ 3న హైదరాబాద్‌లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే దేశంలోనే తొలిసారిగా టీకా బండి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 6న అమల్లోకి తెచ్చింది. ‘మిషన్‌ ఇంద్ర ధనుష్‌’లో భాగంగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలను నేరుగా వారి ఇళ్లకు వెళ్లి వేయాలనేది దీని లక్ష్యం. దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. 


రైతు సమితులు.. రికార్డుల ప్రక్షాళన 
భూవివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న భూముల రికార్డులను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పల్లెపల్లెకు రెవెన్యూ అధికారుల బృందాలను పంపించి రికార్డులను సరిచేసే భారీ కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1,343 బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది అమలు చేసే వ్యవసాయ పెట్టుబడి పథకానికి కొత్త రికార్డులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఇందులో భాగంగానే గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో 15 మందితో సమితిని ఏర్పాటు చేసింది. కానీ మండల స్థాయి, జిల్లాస్థాయి సమితుల ఎంపికతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్ర రైతు సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అర్ధంతరంగానే ఈ ప్రక్రియను నిలిపేసింది.

రుణమాఫీ సంపూర్ణం 
రైతుల రుణమాఫీ పథకం సంపూర్ణమైంది. ఏప్రిల్‌లో చివరి విడత నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.16,374 కోట్లు వెచ్చించిన ఈ పథకంతో 35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వాయిదాల చెల్లింపులతో రైతులపై వడ్డీ భారం పడిందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ.. అలాంటి ఘటనలు తమ దృష్టికి రాలేదని ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు
ఏప్రిల్‌ 26 నుంచి 28 వరకు ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభించి శతాబ్ది పైలాన్‌ను ఆవిష్కరించారు. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చింది. 

గొల్ల, కురుమలకు 30 లక్షల గొర్రెలు
గొల్ల, కురుమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జూన్‌ 20న సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాకలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో మొదటి విడతగా 30 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు.  

భూ సేకరణకు కొత్త చట్టం 
కేంద్ర భూ సేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌ 30న అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. కేంద్రం సూచించిన సవరణలతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. భూ సేకరణలో జాప్యాన్ని నివారించటంతోపాటు నిర్వాసితులకు తక్షణ ప్రయోజనం కల్పించేందుకు ఈ చట్టం తెచ్చినట్లు ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోదంతో మే 17 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.

మెడికల్‌ పార్కు.. ఇమేజ్‌ టవర్‌ 
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో సుల్తాన్‌పూర్‌ సమీపంలో 250 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్కును మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జూన్‌ 17న ప్రారంభించారు. దేశంలోనే పెద్దదైన ఈ పార్కుతో ప్రత్యక్షంగా 4 వేల మందికి పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి లభించనుంది. యానిమేషన్, గేమింగ్‌ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇమేజ్‌ టవర్‌కు నవంబర్‌ 4న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో పదెకరాల్లో రూ.948 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. వీటికితోడు ప్రపంచంలో తొలిసారిగా ఐటీ రంగంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ఐటీ క్యాంపస్‌ ఏర్పడనుంది. 

జోన్లపై అదే ఉత్కంఠ 
ఉద్యోగులు, ప్రభుత్వ నియామకాలకు సంబంధించి ప్రస్తుతమున్న జోనల్‌ విధానాన్ని రద్దు చేయాలని మంత్రివర్గం జూన్‌ 17న తీర్మానించింది. కొత్త జోనల్‌ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జోన్ల రద్దుకు బదులుగా అదనంగా కొత్త జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జోన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

భూముల అక్రమాలు 
మే నెలలో హైదరాబాద్‌లో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోట్ల విలువైన భూములు కావటంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి అపప్రథను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ప్రమేయముందనే ఆరోపణలు దుమారం లేపాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఎనీ వేర్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతిని రద్దు చేసింది. పలువురు సబ్‌ రిజిస్ట్రార్లపై కేసులు నమోదు చేసి వారి విచక్షణాధికారాలను తొలగించింది. 

40 కోట్ల మొక్కలు 
జూలై 12న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకున్నారు.

తొలి మెట్రో పరుగులు 
హైదరాబాద్‌లో తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నవంబర్‌ 28న మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించిన ప్రధాని మెట్రో రైలులో గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో కలసి జర్నీ చేశారు. 

మరిన్ని వార్తలు