విహంగంలో పర్యాటక ప్రచారం

3 May, 2017 01:18 IST|Sakshi
విహంగంలో పర్యాటక ప్రచారం

- వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన పర్యాటక శాఖ
- స్పైస్‌ జెట్‌ విమానానికి రాష్ట్ర టూరిజం స్టిక్కర్లు
- ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించేందుకు విమానాలను సాధనంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా కార్పొరేట్‌ తరహాలో స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737 0800 విమానానికి రాష్ట్రంలోని చారిత్రక అందాలను అద్దింది. మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జీఎంఆర్, స్పైస్‌జెట్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమానంపై అతికించిన రాష్ట్ర టూరిజం ప్రాంతాల చిత్రాలు, శాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయని, వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చందూలాల్‌ చెప్పారు.

గోవా, కేరళ రాష్ట్రాలకు ఒక్క టూరిజం ద్వారానే 70 శాతం ఆదాయం వస్తోందని, మన రాష్ట్రంలోనూ పర్యాటక, చారిత్రక ప్రాంతాలకు కొదవ లేదన్నారు. ఎన్నెన్నో ‘చిత్రాలు’..: స్పైస్‌ జెట్‌ విమా నం బయట ఒకవైపు చౌమొహల్లా, ఫలక్‌నుమాప్యాలెస్‌లు మరోవైపు సెవెన్‌ టూంబ్స్, గోల్కొండ చిత్రాలు ఏర్పాటు చేశారు. విమానంలోని 189 సీట్ల వెనుక రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల చిత్రాలు అంటించారు. వీటిని అమెరికాలో  తయారు చేయించారు. లోపల పర్యాటక ప్రాంతాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ ప్రచారం 2 నెలలు సాగుతుంది. విమానం స్టిక్కర్లు అంటించిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45కి వారణాసి వెళ్లింది. 2 నెలలకు అద్దె రూ.50 లక్షలు. ఈ విమానం  పర్యాటక ప్రచారం కోసం దేశంలోని ప్రాంతాలు, ఇతర దేశాల్లోనూ తిరుగుతుంది.

దేశ, విదేశాల్లోని ప్రజలకు అవగాహన...
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు మాట్లాడుతూ.. దేశ, విదేశాల్లోని ప్రజలకు తెలంగాణ పర్యాటక, చారిత్రక కట్టడాలపై అవగాహన కోసమే ఈ ప్రయత్నమన్నారు. ఇటీవల మిజోరంతోపాటు పలు రాష్ట్రాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తే, తెలంగాణ అంటే ఎక్కడుందని అక్కడి ప్రజలు ప్రశ్నించారన్నారు. మన టూరిస్టు ప్రాంతాలకు ప్రచారం అవసరమని అప్పుడే భావించామన్నారు.

స్పైస్‌ జెట్‌ విమానం రోజుకు 10 నుంచి 15 విమానాశ్రయాల్లో ల్యాండ్‌ అవుతుందని, తద్వారా తెలంగాణ కీర్తి నలు దిశలా వ్యాపిస్తుందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. శాఖ కమిషనర్‌ సునీతాభాగవత్, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెండ్‌ ఛోంగ్తూ, ఈడీ మనోహర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు